Bhairava Dweepam: బాలకృష్ణ అలాంటి పాత్ర ఎందుకు ఒప్పుకున్నాడు?

Bhairava Dweepam: సినిమా హీరోలు ఎంత ఎక్కువ ప్రయోగాలు చేస్తే.. వారు ప్రేక్షకులకు అంత దగ్గరవ్వగలరు.

Update: 2021-09-28 03:30 GMT

Bhairava Dweepam: సినిమా హీరోలు ఎంత ఎక్కువ ప్రయోగాలు చేస్తే.. వారు ప్రేక్షకులకు అంత దగ్గరవ్వగలరు. ఇప్పుడంటే హీరోలు డీ గ్లామర్ రోల్స్ చేయడానికి, లోపాలు ఉన్న పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు ఆదరించరేమోనన్న అనుమానం ఉండేది. అందుకే దర్శకులు కూడా ఎక్కువగా ప్రయోగాలు జోలికి వెళ్లేవారు కాదు. కానీ వారికి భిన్నంగా ఎప్పుడూ ప్రయోగాత్మకమైన కథలతో అందరినీ మెప్పించిన దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు. అసలు ఇలాంటి కథతో సినిమా తీయొచ్చా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా ఉంటాయి ఆయన ఆలోచనలు. ఆయన క్రియేటివిటీ నుండి పుట్టుకొచ్చిన ఒక కథే భైరవద్వీపం.

అప్పట్లో జానపద సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడేవారు కదా.. ఇందులో ప్రయోగం ఏముంది అనుకుంటున్నారా? బాలకృష్ణను కురూపిగా చూపించడమే సింగీతం ఈ సినిమా కోసం చేసిన పెద్ద రిస్క్. అప్పటి హీరోలు జానపద, పౌరాణిక సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ ఒక కురూపిగా, డీ గ్లామర్ రోల్‌లో స్క్రీన్‌పైన కనిపించాలన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా ఏ హీరో సాహసించడు. అలాంటిది అప్పటికే మాస్ హీరోగా ఫైట్లు, డ్యాన్సులతో ప్రేక్షకులను అలరించే బాలకృష్ణ కురూపిగా నటిస్తాడంటే వారు యాక్సెప్ట్ చేస్తారా? చేసారు మరి..

సింగీతం, బాలకృష్ణది టాలీవుడ్‌లో హిట్ కాంబినేషన్. సింగీతం కథలపై బాలయ్యకు చాలా నమ్మకం ఉండేది. అందుకే భైరవద్వీపం కథ చెప్పగానే బాలకృష్ణ ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసారట. అందులో కురూపిగా కనిపించడం కోసం హీరో కనీసం రెండు గంటలైనా మేకప్ కోసం కేటాయించాలి. లంచ్ సమయంలో మేకప్ తీసేస్తే రెండు గంటల సమయం వృధా అవుతుందని దాదాపు 10 రోజులు బాలకృష్ణ కేవలం జ్యూస్‌లే తాగేవారని సింగీతం ఇప్పటికీ చాలా సందర్భాల్లో అన్నారు. అంతే కాకుండా సినిమా విడుదలయ్యే వరకు అలాంటి పాత్రలో బాలయ్య కనిపించనున్నాడని ఎవ్వరికీ తెలీదు. విడుదలయిన తర్వాత అనూహ్యంగా కురూపి పాత్రకు మంచి పేరొచ్చింది. అంతే కాక భైరవద్వీపానికి కలెక్షన్ల వర్షం కురిపించింది. 

Tags:    

Similar News