బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘భైరవం’.తమిళ్ లో హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ టైటిల్, హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు ఆ మధ్య విడుదలైన ఓ వెన్నెల అనే పాట సూపర్బ్ అనిపించుకున్నాయి. తెలుగు నేటివిటీకి అనుగుణమైన మార్పులతో రూపొందినట్టుగా తాజాగా విడుదలైన టీజర్ చూస్తే అర్థం అవుతోంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు అన్నదమ్ములు.. వారికి ఆంజనేయుడులా అండగా నిలబడే శ్రీనుగాడు అనే క్యారెక్టర్ తో కూడిన కథగా కనిపిస్తోంది. అయితే వీరి మధ్య అపార్థాలు రావడం, స్నేహంలో సమస్యలు రావడం.. చివరికి అన్నదమ్ముల కోసం నిలబడే శ్రీనుపైనే వారు తిరగబడటం అనే కోణంలో సినిమా ఉంటుందని ఒరిజినల్ చూసిన వారికి తెలుసు. కాకపోతే ఈ ముగ్గురు భిన్నమైన హీరోలు, వారి ఇమేజ్ లతో చూస్తే ఈ కథ తెలుగులోనే ఎక్కువగా వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోందనేది నిజం. యాక్షన్ తో పాటు అద్భుతమైన ఇంటెన్సిటీ కూడా కనిపిస్తోంది. టీజర్ తోనే చాలా మార్కులు కొట్టేసిందీ టీమ్. ఇక ట్రైలర్ తో పాటు మిగతా పాటలు కూడా వస్తే అంచనాలు పెరుగుతాయి. ఆ పెరిగిన అంచనాలను అందుకుంటే ముగ్గురికీ కలిసి భైరవం ఓ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.
ఇక హీరోల సరసన అదితి శంకర్, ఆనంది, దివ్యాపిళ్లై ఫీమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. జయసుధ, అజయ్, రాజా రవీంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు. కెకె రాధామోహన్ నిర్మించిన ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు. టీజర్ లో నేపథ్య సంగీతం కూడా హైలెట్ గా కనిపిస్తోంది. మొత్తంగా ఈ మధ్య ముగ్గురు హీరోల సినిమాలు తెలుగులో రావడం లేదు. ఈ మూవీ ఆ లోటును భర్తీ చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ కూడా అనిపించుకుంటే మరిన్ని మల్టీస్టారర్లు వచ్చే అవకాశం ఉంది.