కొన్నాళ్లుగా బాలీవుడ్ దారుణమైన పరిస్థితిలోకి దిగజారుతోంది. వచ్చిన సినిమా వచ్చినట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకే ఎక్కువ షాక్ లు తగులుతున్నాయి. లాస్ట్ ఇయర్ పఠాన్, జవాన్ అంటూ షారుఖ్ ఖాన్ ఫామ్ లోకి వచ్చాడు. కానీ అతని బ్యాచ్ కే చెందిన హీరోలెవరూ పర్ఫార్మ్ చేయడం లేదు. కంటెంట్ బేస్డ్ మూవీస్ నుంచి కంప్లీట్ కమర్షియల్ మూవీస్ వరకూ ప్రయత్నిస్తోంది బాలీవుడ్. బట్ రిజల్ట్ మారడం లేదు. ముఖ్యంగా అక్షయ్ కుమార్,అజయ్ దేవ్ గణ్ వంటి వారైతే ఫ్లాప్ టాక్ వినడానికే సినిమాలు చేస్తున్నారా అనేలా ఉంద సిట్యుయేషన్. ఇక అక్షయ్ కుమార్ అయితే ఏకంగా ఇప్పటి వరకూ 13 ఫ్లాపులు చూశాడు. ఈ రికార్డ్ కంగనా రనౌత్ పేరు మీద ఉంది. ఆమె ఏకంగా 16 ఫ్లాపులతో ఉంది. అక్షయ్ రీసెంట్ మూవీ సర్ఫిరా ఈ నెల 12 న విడుదలైంది. తమిళ్ లో సూర్య చేసిన సూరర్ పొట్రుకు రీమేక్ ఇది. సూరరై పొట్రు ఓటిటిలోనే బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తెలుగులోనూ ఆకాశం నీ హద్దురా పేరుతో సూపర్ హిట్ గా నిలిచింది. క్లాసిక్ అనిపించుకున్న ఇలాంటి సినిమాను రీమేక్ చేసినా అక్షయ్ కుమార్ అదృష్టం మారలేదు. విశేషం ఏంటంటే.. ఈ రీమేక్ ను కూడా సుధ కొంగరనే డైరెక్ట్ చేసింది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఇప్పటి వరకూ కేవలం 30 - 35 కోట్ల మధ్యే కలెక్ట్ చేసింది. ఇక ఆల్మోస్ట్ థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. అయితే తన ఫ్లాపులతో పాటు బాలీవుడ్ ఫ్లాపులపై అక్షయ్ కుమార్ వవరణ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
అక్షయ్ ఏమన్నాడంటే.. ‘కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ మారిపోయింది. ప్రేక్షకులూ మారారు. అందుకే మేమెంత కొత్తగా ప్రయత్నించినా.. వర్కవుట్ కావడం లేదు అన్నాడు. ఇలాంటి దశ అందరికీ ఉంది. త్వరలోనే మళ్లీ థియేటర్స్ కు ప్రేక్షకులు వస్తారు. మా సినిమాలు హిట్ అవుతాయి..’ అనే ధోరణిలో అన్నాడు. అయితే కోవిడ్ బాలీవుడ్ కు మాత్రమే రాలేదు. ప్రపంచం అంతా వచ్చింది. అంతెందుకు .. మన సినిమాలు హిందీలో డబ్ అయితే తెగ చూస్తున్నారు కదా.. కంటెంట్ ఉంటే కాసులు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ - 2, సలార్ వంటి బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియన్ మూవీస్ కోవిడ్ తర్వాతే వచ్చి బాలీవుడ్ లోనూ హిట్ కొట్టాయి కదా. వీటికి అడ్డురాని కోవిడ్, ఆడియన్స్ మైండ్ సెట్ కేవలం బాలీవుడ్ కే అడ్డొచ్చిందా.. ఇలా చూస్తే అక్షయ్ కుమార్ వివరణ ఎంత సిల్లీగా ఉందో అర్థం కావడం లేదూ.
అంతెందుకూ.. అదే షారుఖ్ పఠాన్, జవాన్ మూవీస్ సౌత్ లో డబ్ అయితే జనం విరగబడి చూశారు కదా. అందుకే ఆ రెండు సినిమాలూ వెయ్యి కోట్లు కొల్లగొట్టాయి. ఏదేమైనా తన ఫ్లాపులను కవర్ చేసుకునేందుకు బాలీవుడ్ మొత్తం మేటర్ ఆపాదించి ఏదో చెప్పాలనే ప్రయత్నంలో సిల్లీగా మాట్లాడాడు అక్షయ్ అంటున్నారు జనం.