ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బడ్జెట్ పరిమితులకు లోబడి ఉండేది. శంకర్, రాజమౌళి వంటి దర్శకులు ఆ బారికేడ్స్ ను తొలగించారు. అప్పటి నుంచి అన్ని భాషల్లో కంటెంట్ కు తగ్గట్టుగా కాసులు కూడా పెడుతున్నారు. ఆ కంటెంట్ కనెక్ట్ అయితే బడ్జెట్ రికవర్ అవడమే కాదు.. రికార్డ్ కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతున్న రామాయణ బడ్జెట్ మాత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి ఏకంగా 4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారట. అంటే ఇది ఇప్పటి వరకూ ఇండియాలోనే కాస్ట్ లీయొస్ట్ మూవీ అని చెప్పాలి. 4 వేల కోట్లు అంటే ఆరు బాహుబలి లాంటి మూవీస్ తీయొచ్చు. అయినా 4 వేల కోట్లు అంటే మాటలా.
నిజానికి మన పురాణాలను తీయడానికి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ తో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ చేస్తూనే ఉన్నారు. బడ్జెట్ పెరగడం అంటే ప్రేక్షకులకు భక్తి కంటే కూడా కొత్త అనుభూతిని పంచడమే టార్గెట్ గా ఉంటుందని చెప్పాలి. సీతారాముల ప్రేమకథ కంటే కూడా విజువల్ గ్రాండీయరే హైలెట్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. సీతా శోకం కంటే కూడా అశోక వనం గ్రాఫిక్స్ ఎక్కువగా కనిపిస్తాయేమో. ఈ నాలుగు వేల కోట్ల రెండు భాగాలకూ కలిపి పెడుతున్నారట. ఏ పార్ట్ కు ఎంత అనేది అనవసరం కానీ.. రెండు భాగాలుగా రాబోతోన్న రామాయణ బడ్జెట్ 4 వేల కోట్లు అనే మాట ఇండియా మొత్తం వైరల్ గా మారింది.
ఇక రాముడుగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యశ్, హనుమంతుడుగా సన్నీడియోల్, లక్ష్మణుడుగా రవి దూబే నటిస్తోన్న ఈ చిత్రాన్ని నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నాడు. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలు. ఫస్ట్ పార్ట్ ను 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తాం అని గతంలోనే ప్రకటించారు. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా రేంజ్ ను మార్చేలా సినిమా విజయం సాధించి ఈ బడ్జెట్ రికవర్ అయ్యేలా చేస్తుందేమో చూడాలి.