రివ్యూ : బ్రహ్మ ఆనందం
తారాగణం : బ్రహ్మానందం, రాజా గౌతమ్, వెన్నెల కిశోర్, తాళ్లూరి రామేశ్వరి, ప్రియా వడ్లమాని, సంపత్, రాజీవ్ కనకాల తదతరులు
ఎడిటర్ : ప్రణీత్ కుమార్
సంగీతం : శాండిల్య పీసపాటి
సినమాటోగ్రాఫర్ : మిథేష్ పర్వతనేని
నిర్మాత : రాహుల్ యాదవ్ నక్కా
దర్శకత్వం : ఆర్వీఎస్ నిఖిల్
ఏ తండ్రి కొడుకులైనా సినిమాలో తాత మనవళ్లుగా నటిస్తున్నారు అంటే ఆసక్తి పెరుగుతుంది. ఆ కంటెంట్ పై అంచనాలుంటాయి. బ్రహ్మ ఆనందం మూవీ అనౌన్స్ అయినప్పుడు కూడా ప్రేక్షకులు ఇలాగే ఫీలయ్యారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఆయన తనయుడు రాజా గౌతమ్ ఈ తాత మనవళ్లు అన్నప్పుడు ఖచ్చితంగా మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేశారు ఆడియన్స్. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం అందుకుందా లేదా అనేది చూద్దాం.
కథ :
బ్రహ్మానందం( రాజా గౌతమ్) చిన్నప్పుడే తల్లి తండ్రులను కోల్పోతాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ ఏ ఎమోషన్ లేకుండా తన ఏకైక ఫ్రెండ్ గిరి(వెన్నెల కిశోర్)తో కలిసి జీవిస్తుంటాడు. అతన్ని తార(ప్రియ వడ్లమాని) ప్రేమిస్తుంటుంది. అతను కేవలం తనను డబ్బుల కోసం వాడుకుంటాడు. బట్ రియల్ లైఫ్ లో ఎమోషన్స్ లేకున్నా నాటక రంగం (థియేటర్ ఆర్టిస్ట్) లో వెలగాలనుకుంటాడు. అందుకూ అవకాశాలు రావు. ఓ సారి అనుకోకుండా ఢిల్లీలో తను రాసిన నాటకం ప్రదర్శించే అవకాశం వస్తుంది. కానీ అందుకు 6 లక్షలు కావాలంటారు. ఈ 6 లక్షలూ తాను ఇస్తానంటాడు ఆనంద మూర్తి (బ్రహ్మానందం). తనకు ఊర్లో ఓ ఆరెకరాల పొలం ఉందని.. దాన్ని అమ్మేసి డబ్బు ఇస్తా అని ఊరికి తీసుకువెళతాడు. మరి అక్కడికి వెళ్లాక పొలం అమ్మారా..? బ్రహ్మానందం ఢిల్లీలో ప్రదర్శన చేశాడా.. అతని ప్రేమకథ ఏమైంది అనేది మిగతా కథ.
ఎలా ఉంది అంటే :
కొన్ని కథలు టేకాఫ్ బానే ఉంటుంది. కానీ ప్రయాణ(కథనం)మే కష్టంగా మారుతుంది. బ్రహ్మా ఆనందం కథనం కూడా అలాంటిదే. ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసిన లేదా వాళ్లు చెప్పాలనుకున్న కథలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా లోపించింది. అక్కడక్కడా కొన్ని నవ్వులు వర్కవుట్ అయ్యాయి తప్ప ఎమోషన్ అయితే అస్సలే పండలేదు. నిజానికి ఈ ప్రేమికుల రోజు విడుదలైన ఈ కథలో ఓ లవ్ స్టోరీ ఉంది. కానీ అది రాజా గౌతమ్ ది కాదు. బ్రహ్మానందంది. ఈ వయసులో ఆయనకి ప్రేమేంటి అనే కోణంలో వినోదం పంచితే కొంత వరకు వర్కవుట్ అయ్యేదేమో.. కానీ ‘వృద్ధులకు ప్రేమ ఎందుకంటే ఒంటరిగా ఉండకుండా ఉండేందుకే తప్ప శారీరక అవసరాల కోసం కాదు’అని బ్రహ్మానందం పాత్ర చెప్పినట్టుగా ఆ కోణంలోనూ కథనం సాగదు. ఎవరు ఎవరికి ఏమౌతారు.. వీరి వరసలేంటీ అనేది మనమే ఊహించుకోవాలి తప్ప దర్శకుడు చెప్పడు. అంత ఇమెచ్యూర్ గా ఉంది రైటింగ్, డైరెక్షన్. అసలే మాత్రం పరిపక్వత లేని దర్శకత్వం ఈ మధ్య కాలంలో ఇదేనేమో.
ఊరికి వెళ్లిన తర్వాత పొలం లేదని తెలిసిన తర్వాత కూడా అక్కడే ఉండటం.. ఆ ఊరిలో వెన్నెల కిశోర్ కు ఇల్లు ఉండటం..90 ఎకరాల సర్పంచ్ కూటికి కూడా టికానా లేని వాడిని ‘నీ కులం ఏంటో చెప్పు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా’ అనడం.. సర్పంచ్ అన్న.. ప్రేమలో ఫెయిల్ అయ్యి టెన్త్ క్లాస్ పాస్ కావాలని 30యేళ్లుగా తపించడం.. ఇవన్నీ చాలా అంటే చాలా సిల్లీగా కనిపించే ప్లాట్స్. సిల్లీగా ఉన్నా .. కొన్నిటిని మంచి రైటింగ్ తో బెటర్ చేయొచ్చు. ఇక్కడ అదీ లోపించింది. పూర్ రైటింగ్. కాకపోతే అక్కడక్కడా పంచ్ లు మాత్రం బాగా పేలాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్, రాజా గౌతమ్ సన్నివేశాల్లో.
ఒక స్వార్థపరుడైన యువకుడికి బంధాలు తెలిసేలా చేయాలనుకున్నాడు దర్శకుడు. అది వర్కవుట్ కాలేదు. ఓ వయసు మల్లిన జంటను ఒకరికొకరు తోడుగా ఉండేలా చేయడంలో సమాజం తప్పు పట్టడంలో అర్థం లేదు అని చెప్పాలనుకున్నాడు. అది నవ్వుల పాలైంది. ఈ రెండో ఎపిసోడ్ ను హృద్యంగా చెప్పే అవకాశం ఉంది. చిల్లర కామెడీతో చెప్పడంతో దర్శకుడి ఉద్దేశం గాడి తప్పింది.
అయినా బ్రహ్మ ఆనందం చూస్తున్నంత సేపూ కాస్త వినోదాత్మకంగానే కనిపిస్తుంది. బ్రహ్మానందం వయసు ప్రభావం కనిపిస్తున్నా.. ఛలాకీ తనం తగ్గకుండా చూసుకున్నాడు. కాకపోతే ఈ పాత్రకు ఆయనే మైనస్ అని చెప్పక తప్పదు. వెన్నెల కిశోర్ పంచ్ లతో అదరగొట్టాడు. రాజా గౌతమ్ టైమింగ్ చాలా బావుంది. హీరోగానే కాక ఇతర పాత్రలూ ప్రయత్నిస్తే మంచి కెరీర్ ఉండే అవకాశం ఉంది. ప్రియ వడ్లమాని పాత్ర పరిమితం. అయినా ఆకట్టుకుంటుంది. సంపత్ కు చాలా రోజులకు ఓ మంచి పాత్ర పడింది. అతను బాగా చేశాడు. కాకపోతే క్యారెక్టరైజేషన్ లో దమ్ము లేదు. రాజీవ్ కనకాల, ఐశ్వర్య ఓకే.
సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ యావరేజ్. ఎడిటింగ్ పరంగా ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి. కానీ ఈ బ్యానర్ లో ఇప్పటి వరకూ వచ్చిన మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి చిత్రాలతో పోలిస్తే బ్రహ్మ ఆనందం వాటి సరసన నిలబడలేదు. ఇక దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ ఏం రాసుకుని ఏం చెప్పాలనుకున్నాడో కానీ రచన, దర్శకత్వం రెండిటిలోనూ తేలిపోయాడు. చాలా ఇమెచ్యూర్ గా ఉంది అతని వర్క్.
ప్లస్ పాయింట్స్ :
అక్కడక్కడా పేలిన పంచ్ లు
వెన్నెల కిశోర్
రాజా గౌతమ్
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
డైలాగ్స్
బ్రహ్మానందం
క్లైమాక్స్
ఫైనల్ గా : స్వల్ప ఆనందం
రేటింగ్ : 2/5
బాబురావు. కామళ్ల