BALAKRISHNA: బాలకృష్ణకు అభినందనల వెల్లువ

ఎన్టీఆర్ వారసత్వం నిలబెట్టారన్న చంద్రబాబు... తగిన గుర్తింపు దక్కిందన్న జూనియర్ ఎన్టీఆర్;

Update: 2025-01-26 03:00 GMT

నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం వరించింది. మన దేశంలోని మూడో అత్యున్నత పురస్కారంతో ఆయనను కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. బాలకృష్ణకు పద్మ అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసలు

బాలకృష్ణకు పద్మ పురస్కారం రావడంపై ఆయన బావ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైనందుకు బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. "తెలుగు సినీ దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం పొందినందుకు హృదయపూర్వక అభినందనలు. లెజెండరీ ఎన్టీఆర్ గారి వారసత్వాన్ని నిలబెడుతూ, మీరు సినిమా, రాజకీయాలు, దాతృత్వంలో ముందున్నారు. ప్రజా సంక్షేమానికి ప్రత్యేకించి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీ అంకితభావం లెక్కలేనన్ని జీవితాలను నిలబెట్టింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. ఇది నిజమైన ఐకాన్‌కు దయగల నాయకుడికి తగిన గౌరవం" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ కూడా..

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్స్‌ ద్వారా స్పందించారు. ‘బాలా బాబాయ్‌కు అభినందనలు. సినీ, రాజకీయ సేవలో ఆయనకు తగిన గుర్తింపు దక్కింది’ అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘పద్మభూషణ్‌ అందుకున్న మీ అందరి బాలయ్య, నా ముద్దుల మావయ్య బాలకృష్ణకు అభినందనలు’ అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

కల్యాణ్‌రామ్, శ్రీభరత్ అభినందనలు

ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ అవార్డుకు ఎంపికైన బాబాయ్‌ నందమూరి బాలకృష్ణకి హృదయపూర్వక అభినందనలు. ఈ సన్మానం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు, సమాజానికి సేవ చేయడంలో మీ నిర్విరామ కృషికి నిజమైన గుర్తింపు అని కల్యాణ్‌రామ్ ట్వీట్ చేశారు. మామయ్య నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్‌ అవార్డు లభించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అల్లుడు శ్రీభరత్ తెలిపారు. ఇటీవల నటజీవితంలో స్వర్ణోత్సవాన్ని జరుపుకొన్న బాలకృష్ణ.. తెలుగు సినిమా ఎదుగుదలకు ఎంతో అకింతభావంతో సేవ చేశారని అన్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఆయన.. ఎన్నో సంవత్సరాలుగా సమాజ సేవ చేస్తున్నారని.. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని శిఖరాలను అధిరోహించి.. ఇంకా మరెన్నో గౌరవాలు అందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని వెల్లడించారు.

Tags:    

Similar News