నేచురల్ స్టార్ నాని తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తన అభిరుచికి తగ్గ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇందులోనే హిట్ అనే ఫ్రాంఛైజీతో కమర్షియల్ మూవీస్ కూడా రూపొందిస్తున్నాడు. తాజాగా ఈ బ్యానర్ నుంచి 'కోర్ట్' అనే మూవీతో వస్తున్నాడు. రామ్ జగదీష్ దర్శకుడు. ప్రియదర్శి, శివాజీ,హర్ష్ రోషన్,శ్రీదేవి, రోషిణి, సాయికుమార్త్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 14న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.ఒక యూనిక్ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథలా కనిపిస్తోందీ మూవీ. ఈ దేశంలో ఎన్ని చట్టాలున్నా.. చాలా బలమైనదిగా భావించేది పోక్సో చట్టం. మైనర్ అమ్మాయిలపై అఘాయిత్యాలకు సంబంధించిన బలమైన చట్టం ఇది. ఒక్కసారి నమోదైతే ఆ వ్యక్తుల జీవితాలు దారుణంగా అయిపోతాయి. తప్పు చేసిన వారు జీవితాంతం ఆ తప్పును అనుభవించేలా ఉంటుంది. అయితే అలాంటి చట్టం కొందరి వల్ల దుర్వినియోగం అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ కథ అల్లుకున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
మామూలుగా ధనవంతుల అమ్మాయిని ప్రేమిస్తే ఆ కుర్రాళ్లను చంపేయడం.. సినిమాలైతే కుర్రాళ్లు తిరగబడి హీరోయిజం చూపించడం చూస్తుంటాం.ఆ కోణంలోనే మైనర్ అయిన తన కూతురును ప్రేమించాడనే కారణంతో ఓ ధనవంతుడు తన బలంతో ఆ కుర్రాడిపై అనేక సెక్షన్ల కింద కేస్ పెట్టిస్తాడు. అందులో పోక్సో కూడా ఉంటుంది. ఆ కేస్ ను వాదించడానికి లాయర్ లెవరూ ముందుకు రారు. బట్ ఆ కుర్రాడు తప్పు చేయలేదు అని నమ్మిన ఓ యువ లాయర్(ప్రియదర్శి) ముందుకు వస్తాడు. మరి ఈ కేస్ నుంచి అతనెలా బయటపడ్డాడు అనేది సినిమాలో చూడాలి. అలాగే ఈ చట్టం ఎలా దుర్వినియోగం అవుతుందనే చర్చలు కూడా ఉంటాయోమో.. కానీ ట్రైలర్ మాత్రం బావుంది. ఆకట్టుకునే ఇంటెన్స్ తో కూడిన కోర్ట్ రూమ్ డ్రామాలా కనిపిస్తోంది. మరి కమర్షియల్ గా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.