బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. 1950లో జన్మించిన మిథున్ చక్రవకర్తి 1976లో హిందీ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. వైవిధ్యమైన నటనతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. డిస్కో డ్యాన్స్ ను దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చిన ఘనత అతనిదే. తన సినిమాల్లో ఆ తరహా పాటలు, డ్యాన్సులు ఖచ్చితంగా ఉండాలని కోరుకునే వారు ప్రేక్షకులు. రొమాంటిక్ మూవీస్ తో యాక్షన్ మూవీస్ తోనూ మెప్పించారు. ఆ రోజుల్లో టాప్ హీరోలంతా యేడాదికి చాలా ఎక్కువ సినిమాలు చేసేవారు. తెలుగులో హీరో కృష్ణ ఆ తరహాలో యేడాదికి డజనుకు పైగా చిత్రాలతో రికార్డులు సృష్టించేవారు. అలా మిథున్ కూడా 1989లో 19 సినిమాలు విడుదల చేసి సంచలనం సృష్టించారు.
ఇక ఇండియన్ సినిమాకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ పురస్కారాన్ని ఆయనకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మిథున్ కు అవార్డ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని అక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ తో పాటు ఆయనకు అందించనున్నారు.