కొందరు దర్శకులకు కోపం ముక్కుమీదే ఉంటుంది. అవతలి వాళ్లు తాము చెప్పింది చేయకపోతే ఓపిగ్గా చేయించుకోవడం తెలియదు. లేదా ఓపిక నశించిన తర్వాతనే ఏమో కానీ.. చుట్టూ ఎవరున్నారు అనేది కూడా చూడకుండా ఆర్టిస్టుల చెంప చెళ్లుమనిపిస్తారు. ఈ విషయంలో దివంగత దర్శకుడు వి మధుసూదన్ రావు పేరు ఎక్కువగా వినిపించేది. శోభన్ బాబుకు స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా రెండు సినిమాలకు సంబంధించి రెండుసార్లు అందరి ముందే ఆయన చెంపలు వాచేలా కొట్టాడు మధుసూదన్ రావు. ఈ తరంలో అంత కోపం ఉన్న దర్శకుడు అంటే మరో డౌట్ లేకుండా వినిపించే పేరు తేజ.
చిత్రం సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు తేజ. అంతకు ముందు సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ ఎక్స్ పీరియన్స్ తోనే మెగా ఫోన్ పట్టాడు.
అయితే తేజ అందరూ చిన్న ఆర్టిస్టులు, కొత్తవాళ్లతోనే పనిచేయించుకున్నాడు. అనుభవం లేకపోవడం వల్ల వాళ్లు ఈయన చెప్పింది సరిగా చేయకపోతే అందరి ముందే కొట్టేవాడు అని ఎన్నోసార్లు విన్నాం. అందుకు ఉదయ్ కిరణ్ నుంచి నితిన్ వరకూ ఎవరూ మినహాయింపు కాదు. ఇంక ఆయనే పరిచయం చేసిన కమెడియన్స్ అందరూ అతని చేతి దెబ్బలు తిన్నవాళ్లే. ఈ లిస్ట్ లో అబ్బాయిలే కాదు.. హీరోయిన్లు కూడా ఉన్నారట.
తాజాగా ఈ విషయాన్ని నువ్వునేను హీరోయిన్ అనిత చెప్పింది. ‘తేజతో వర్క్ చేయడం అంత సంతోషంగా ఏం ఉండదు. నువ్వు నేను షూటింగ్ టైమ్ లో అతను నన్ను చాలాసార్లు కొట్టాడు..’ అంటూ ఆ పాత విషయాలను పంచుకుంది అనిత.
నువ్వు నేనుతో బాగా ఫేమ్ అయిన అనిత తర్వాత ఆ ఫేమ్ ను స్టార్డమ్ గా మార్చుకోవడంలో తడబడింది. ఈ మూవీలో ఉదయ్ కిరణ్ తో తన కెమిస్ట్రీ బాగా పండింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. పెద్దగా సక్సెస్ రేట్ లేకపోవడంతో కెరీర్ కు ఎండ్ కార్డ్ పడింది. అయితే తేజ తనను కొట్టాడని చెప్పింది కాబట్టి దీనికి తేజ రియాక్షన్ ఎలా ఉంటుందో మరి.