శోభన.. 80, 90 కాలంలో దక్షిణాది సినిమాను తన నటన, నాట్యంతో మైమరపించిన బ్యూటీ. ఆమె కళ్లు పలికే హావభావాలకు ఫిదా కాని వారు లేరు. ఎక్స్ పోజింగ్ పాత్రలకు దూరంగా ఉన్నా.. గ్లామరస్ బ్యూటీగానే పేరు తెచ్చుకుంది. నటనకు ఆస్కారం ఉండే పాత్రల్లో అదరగొడుతూ.. చాలా తక్కువ టైమ్ లోనే నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రతిభావంతమైన నటి శోభన. తాజాగా భారత ప్రభుత్వం శోభనకు పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. 2006లోనే తనకు పద్మశ్రీ అవార్డ్ వచ్చింది. శోభయ వయసు ఇప్పుడు 54యేళ్లు. అయినా తను ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు.
1982లోనే భక్తధృవ మార్కండేయ అనే బాలల సినిమాతో తెలుగులో పరిచయం అయింది. మార్చండి మన చట్టాలు మూవీతో హీరోయిన్ గా తెలుగుకు తెరకు పరిచయం అయింది. కానీ చాలాకాలం పాటు తనకు తెలుగులో బ్రేక్ రాలేదనే చెప్పాలి. నాగార్జున ఫస్ట్ మూవీ విక్రమ్ లో తనే హీరోయిన్. వెంకటేష్ తో అజేయుడు, త్రిమూర్తులు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు చిత్రాల్లో నటించింది. 1988లో వచ్చిన రుద్రవీణ, అభినందన తిరుగులేని బ్రేక్ నిచ్చాయి. రుద్రవీణ కమర్షియల్ గా ఫ్లాప్ అయినా శోభన పాత్రకు, నటనకు గొప్ప గుర్తింపు వచ్చింది. ఇక అభినందన గురించి చెప్పేదేముంది. ప్రాణంగా ప్రేమించిన వాడికి దూరమై తన అక్క భర్తకు రెండో భార్యగా వెళ్లాల్సిన పరిస్థితిలో ఆమె పడే మానసిక సంఘర్షణను అద్భుతంగా అభినయించింది. ఆపై నారీ నారీ నడుమ మురారి, కోకిల, అల్లుడుగారు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీగారి పెళ్లాం, రౌడీ అల్లుడు, కన్నయ్య కిట్టయ్య, నిప్పురవ్వ వంటి విజయ వంతమైన చిత్రాల్లో నటించింది. చివరగా కల్కి చిత్రంలోనూ కనిపించింది.
అటు తమిళ్, మళయాల సినిమాల్లోనూ తనదైన ముద్రను బలంగా వేసింది శోభన. ఎన్నో సినిమాల్లో నటించి మరెన్నో అవార్డులూ అందుకున్న శోభన ఇప్పటి వరకూ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం తన వయసు చిన్నప్పటి నుంచే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న శోభనను పెళ్లి చేసుకోవాలని అన్ని పరిశ్రమల్లోనూ చాలామంది ప్రయత్నించారు అని చెబుతారు. అలాగే తను కూడా కెరీర్ తొలినాళ్లలో ఓ మళయాల నటుడిని ప్రేమించినా పెళ్లి వరకూ వెళ్లలేదు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే తనను డ్యాన్స్, సినిమాలు వదిలేయమని చెప్పినవాళ్లూ ఉన్నారట. కానీ తనకు సినిమాలకంటే డ్యాన్స్ అంటే ఆరో ప్రాణం. అలాంటి కళను వదిలేయమని చెప్పడం నచ్చలేదు. ఒకవేళ ఇప్పుడు ఒప్పుకుని పెళ్లి తర్వాత అభ్యంతరం చెబితే ఎలా అనుకుందట. అందుకే తన కళకు, స్వేచ్ఛకు అడ్డు లేకుండా ఉండాలంటే అసలు పెళ్లే చేసుకోవద్దు అని నిర్ణయించుకుంది. అందుకే ఒంటరిగా ఉండిపోయింది. ఇప్పటికీ సినిమాలు వస్తే నటిస్తుంది. లేదంటే తన డ్యాన్స్ అకాడెమీలో వేలమంది క్లాసికల్ డ్యాన్సర్స్ ను తయారు చేస్తుంది. అప్పుడప్పుడూ నృత్య ప్రదర్శనలు కూడా చేస్తూ హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్నా అని చెబుతుంది శోభన.