ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలపై చేసిన కమెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇండియాలో సినిమా హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. మొదటి రోజే సినిమాలు చూసేయాలన్న ఆరాటంతో ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇంతకీ ఆయనేం చెప్పాడంటే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో నిర్వహించిన ‘మెగా పేరెంట్ - టీచర్ మీటింగ్’లో మాట్లాడుతూ.. సినిమా హీరోలను ఆదర్శంగా తీసుకోవద్దు. మీ ఉపాధ్యాయుల్లోనే హీరోలు ఉంటారు. వారిలోనే హీరోలను చూసుకోండి అని చెప్పాడు. మీకున్న హీరోలు మీ అధ్యాపకుల్లోనే ఉంటారు.. నేను హీరో అయినా చెబుతున్నాను అంటూ ఆయన మాట్లాడిన మాటలకు పిల్లల్లో జోష్ కనిపిస్తే.. టీచర్స్ లో గౌరవం రెట్టింపయ్యింది.
ఇదే మీటింగ్ లో పవన్ చెప్పినట్టు అప్పట్లో టీచర్స్ లోనే ఎక్కువమంది హీరోలను చూసుకునేవారు. అఫ్ కోర్స్ కొంతమందికి వారిలోనే విలన్స్ కూడా కనిపిస్తారనుకోండి. బట్ అక్కడి వారిని హీరోలుగా చూసినా, విలన్స్ గా చూసినా వారి బాధ్యతల్లో మాత్రం మార్పులు ఉండవు. అదే తేడా. తమ విద్యార్థులు బాగు పడాలని కోరుకోవడంలో తల్లితండ్రులకు ఏ మాత్రం తీసిపోని వారు గురువులు మత్రమే. అందుకే మన దేశంలో తల్లితండ్రుల తర్వాత గురువుకే గౌరవం ఇస్తూ గురు దేవో నమః అన్నారు. అంచేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకుంటే వారి భవిష్యత్ ఇంకా బావుంటుంది.