మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఇప్పటి వరకూ ఈ మూవీ అనుకున్న స్థాయిలో అంచనాలను పెంచడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. బట్ ట్రైలర్ పై మెగా ఫ్యాన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను ట్రైలర్ అందుకుందా అంటే.. అవుననే చెప్పాలి. శంకర్ సినిమా అంటే విజువల్ గ్రాండీయర్స్ కనిపిస్తాయి. ఈ ట్రైలర్ చూస్తే ఇప్పటి వరకూ శంకర్ ఈ రేంజ్ గ్రాండీయర్ గా ఏ మూవీ రూపొందించలేదు అనేలా ఉంది. కంటెంట్ పరంగానూ గ్యారెంటీగా ఆకట్టుకోబోతున్నారు అనిపిస్తోంది.
‘వంద ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే పెద్దగా నష్టం లేదు. ఆ ఒక్క ముద్ద వంద చీమలకు ఆహారం అవుతుంది’ అనే డైలాగ్ చూస్తే గేమ్ ఛేంజర్ అవినీతి పరుల ఆటకట్టించే ఐఏఎస్ అనుకోవచ్చు. అటు రాజకీయాల వల్ల విసిగిపోయిన అప్పన్న అనే ఓ కామన్ మేన్ తనే సొంతంగా పార్టీ పెట్టి.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం సంపాదించడం కాదు అని ప్రకటించడం.. అతన్ని కొందరు నమ్మిన మనుషులే హతమారిస్తే.. ఆ తర్వాత ఆయన తనయుడుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఈ పాత్ర ఎలా రియాక్ట్ అయింది అనేది చూడొచ్చు. ఆశ్చర్యంగా రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ తో కూడా కనిపిస్తున్నాడు. అంటే త్రిపాత్రాభినయం చేస్తున్నాడా అనే డౌట్ కూడా కలుగుతుంది. లేదంటే అంతా ఊహిస్తున్నట్టుగా మొదట ఐపిఎస్ అయ్యి తర్వాత ఐఏఎస్ అవుతాడా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. అదే నిజమైతే ఇది రామ్ పోతినేని వారియర్ తో పోలికలుగా మారుస్తారు చాలామంది.
ఇక పాత్రల పరంగా చూస్తే అప్పన్నగా, ఐఏఎస్ గా, పోలీస్ గా, కాలేజ్ స్టూడెంట్, లుంగీ ఎగ్గట్టి మాస్ మేన్ గా ఇలా చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి ఈ పాత్రలో. నటుడుగా చరణ్ కు ఓ ఛాలెంజింగ్ రోల్ కూడా అనిపిస్తోంది. కియారా జస్ట్ సాంగ్స్ కే పరిమితం అయ్యే హీరోయిన్ లా ఉంది. ఉన్నంతలో అంజలికి బలమైన పాత్ర పడినట్టు కనిపిస్తోంది. ఎస్.జే. సూర్య, చరణ్ కాంబినేషన్ కు థియేటర్స్ లో విజిల్స్ పడటం ఖాయం అనేలా ట్రైలర్ లోనే కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి. శ్రీకాంత్, సునిల్, జయరామ్, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం పాత్రలు ఉన్నాయి. థమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యేలానే ఉంది.
సో.. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఓ బ్లాక్ బస్టర్ ను ‘ప్రిడిక్ట్’ చేయొచ్చు అనేలా కనిపిస్తోంది ట్రైలర్. కాకపోతే హడావిడీగా కాక కాస్త మంచి డైలాగ్స్ కూడా పడేలా కట్ చేసి ఉంటే ఇంకా బావుండేదేమో అనిపిస్తుంది.