ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన జోడీకి మంచి క్రేజ్ వస్తుంది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి ఇండస్ట్రీ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఈ యేడాది నాని నిర్మించిన కోర్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. కోర్ట్ లో నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవి ఈ జంటకూ మంచి క్రేజ్ వచ్చింది. అందుకే అదే జంటతో మరో సినిమా స్టార్ట్ అయింది. ‘బ్యాండ్ మేళం’అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ నుంచి ఫస్ట్ బీట్ అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో చూడగానే ఇన్ స్టంట్ గా నచ్చేలా ఉంది. కోన కార్పోరేషన్ బ్యానర్ పై కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సతీష్ జవ్వాజి డైరెక్ట్ చేస్తున్నాడు. కోర్ట్ మూవీ వైజాగ్ నేపథ్యంగా సాగితే ఈ బ్యాండ్ మేళం తెలంగాణ నేపథ్యంగా తెరకెక్కుతోంది.
తాజాగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియోనే ఆకట్టుకుంటోంది. హర్ష్ రోషన్ రాజమ్మ(శ్రీదేవి)ని వెదుక్కుంటూ ఆమె ఇంటికి వెళతాడు. అయితే రాజమ్మ అని పిలవడం ఆమెకు ఇష్టం ఉండదు.. అందుకే ‘రాజమ్మెవత్తిరా రాజమ్మా.. గునపమేసి గుద్దుతా.. బావ్ బాడుకావ్’ అని తిడుతుంది. ఆ వెంటనే సరే చెప్పు ఏంది ముచ్చటా అని అడుగుతుంది. దానికి అతను నీ కొరకు ఓ కొత్త ట్యూన్ గొట్టిన ఇంటవా అంటడు. తను షురూ చెయ్ అంటుంది. దానికతను.. ‘ఈ యాదగిరి వాయించితే భువనగిరిదాక ఇనవడ్తది’ అంటూ మొదలుపెడతాడు. ఈ వీడియో బాగా ఆకట్టుకుంటోంది. బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాండ్ మేళం.. ప్రతీ బీట్ కూ ఓ ఎమోషన్ ఉంటుంది అనే క్యాప్షన్ తో రూపొందుతున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.