Bheemla Nayak Actor : భీమ్లానాయక్ సినిమాలో రెండే రెండు సీన్లతో ఫుల్ పాపులర్ .. ఎవరీ నటుడు?
Bheemla Nayak Actor : కారు డిజిల్ అయిపోతే డానియల్ శేఖర్ నడుచుకుంటూ అడవిలో మేకలు కాచుకుంటున్న ఓ గడ్డం మనిషి దగ్గరకొచ్చి భీమ్లానాయక్ గురించి అడుగుతాడు..;
Bheemla Nayak Actor : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పవన్, రానా నటనకి ప్రశంసలు వస్తున్నాయి.
ఈ సినిమాలో పవన్, రానాలతో పాటుగా చాలా పాత్రలకి మంచి పేరొచ్చింది. అందులో ఒకరు చౌదరి. సినిమాలో కారు డిజిల్ అయిపోతే డానియల్ శేఖర్ నడుచుకుంటూ అడవిలో మేకలు కాచుకుంటున్న ఓ గడ్డం మనిషి దగ్గరకొచ్చి భీమ్లానాయక్ గురించి అడుగుతాడు.. ఆ గడ్డం మనిషి పాత్రలో నటించారు నటుడు చౌదరి.. ఆయన అసలు పేరు మాదల మధుసూదన చౌదరి. భీమ్లానాయక్ సినిమాలో కీలకమైన రెండు సన్నివేశాల్లో కనిపించి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు ఈ నటుడు. దీనితో ఈ నటుడు ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
మధుసూదన చౌదరి రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత. నాటకాల్లో ఆయన ఏకంగా 17 నంది అవార్డులను అందుకున్నారు. ఇక భీమ్లానాయక్ ఆయనకి మొదటి చిత్రమేమి కాదు. ఇప్పటివరకు ముప్పైకి పైగా సినిమాల్లో నటించారు చౌదరి. మహాత్మ చిత్రంలో జయప్రకాశ్‌రెడ్డి కొడుకుగా నటించి మెప్పించారు. ఇక పవన్ తో కూడా భీమ్లానాయక్ మొదటి చిత్రం కాదు.. అంతకుముందు గబ్బర్‌సింగ్, అజ్ఞాతవాసి చిత్రాలలో నటించారు కానీ ఆ సినిమాలు ఆయనకి ఎలాంటి ఇంపాక్ట్ ని తీసుకురాలేకపోయాయి.
ఇప్పుడు భీమ్లానాయక్ సినిమాలో గడ్డం మనిషి పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ పాత్రకి ఆయనని సెలెక్ట్ చేసింది పవన్ కళ్యాణ్ కావడం.. ఈ విషయాన్ని చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా భీమ్లానాయక్ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగవంశీ నిర్మించగా, దీనికి థమన్ ఎస్ సంగీతం అందించారు. నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.