కామెడీ వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో చూశాం. ఒక దశలో బ్రహ్మానందం వల్లే హిట్ అయిన మూవీస్ ను చూశాం. విశేషం ఏంటంటే.. ఈ మూవీస్ లో స్టార్ హీరోలు కూడా ఉంటారు. అయినా కేవలం కామెడీయే హైలెట్ గా రిపీట్ ఆడియన్స్ తో కమర్షియల్ గా కాసులు కొల్లగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా అలాంటి జెన్యూన్ కామెడీ కనిపించడం లేదు. డబుల్ మీనింగ్స్ ఎక్కువయ్యాయి. సిట్యుయేషన్ కు తగ్గ హాస్యం కనిపించడం లేదు. ఏదో అలా వచ్చేస్తోందంతే. బట్ ఈ మధ్య కాలంలో మళ్లీ అలాంటి కామెడీ కనిపిస్తోంది. కనిపించడమే కాదు.. సినిమాలను నిలబెడుతోంది కూడా. కాకపోతే ఈ మూవీస్ లో చిన్న హీరోలే ఉన్నారు. ఇంకా చెబితే కొత్తవాళ్లే. అయినా హీరోల కంటే సైడ్ ఆర్టిస్టుల కామెడీ వల్ల సినిమాలు నిలబడ్డాయి.
లాస్ట్ ఇయర్ వచ్చిన మ్యాడ్ మూవీ గురించి ఎవరూ మర్చిపోరు. కాస్త అడల్ట్ డైలాగ్స్ పడ్డా.. ఆ సినిమాలో హీరోల కంటే ఎక్కువ హైలెట్ అయింది సంగీత్ శోభన్. దివంగత దర్శకుడు శోభన్ తనయుడు ఈ సంగీత్. అన్న సంతోష్ హీరోగా ట్రై చేస్తున్నాడు. ఇతను మాత్రం రాజేంద్ర ప్రసాద్ రేంజ్ టైమింగ్ తో మ్యాడ్ మూవీలో హైలెట్ అయ్యాడు. అతనితో పాటు సైడ్ క్యారెక్టర్స్ వల్లే ఈ మూవీ పెద్ద విజయం సాధించింది అనేది కాదనలేని నిజం.
ఇక రీసెంట్ గా వచ్చిన ఆయ్ మూవీ సైతం అంతే. హీరో నార్నే నితిన్ అయినా.. అతనికి మంచి లవ్ ట్రాక్ ఉన్నా.. సినిమాకు మెయిన్ పిల్లర్స్ గా నిలిచింది మాత్రం రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్యలే హైలెట్ గా నిలిచారు. ఈ ఇద్దరి టైమింగ్ కు థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోయాయి. సినిమాలో హీరోయిజం కూడా కనిపించదు. దీంతో ఈ ఇద్దరికి ఇంకా పెద్ద స్పేస్ దొరికింది. వీరి వల్లే సినిమా సగానికి పైగా విజయం సాధించిందని చెప్పొచ్చు.
ఇక లేటెస్ట్ గా వచ్చిన మత్తు వదలరా 2 లో సత్య కామెడీయే హైలెట్. ఇతర పాత్రలు ఎన్ని ఉన్నా..అందరూ అతనిపైనే ఫోకస్ చేసేలా తనదైన టైమింగ్ తో అదరగొట్టాడు. చూసిన ప్రతి ఒక్కరూ సత్య లేకపోతే సినిమాలో ఏం లేదు అనేంత పెద్ద కమెంట్స్ చేస్తున్నారంటే అతని పాత్ర ఎంత కామెడీ పంచిందో అర్థం చేసుకోవచ్చు. సో.. బలమైన కథలతో పాటు ఇలాంటి నటులతో బలమైన ట్రాకులు రాసుకున్నా వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయని ఈ సినిమాలు మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. కేవలం హీరోలపైనే కాదు.. ఇలాంటి నటులపైనా ఫోకస్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుందని నిరూపించాయీ సినిమాలు.
ఇప్పటికే మనం చెప్పుకున్న ఆర్టిస్టులపై రైటర్స్, డైరెక్టర్స్, మేకర్స్ బాగా కాన్ సెంట్రేట్ చేస్తున్నారు. వీరు మాత్రమే కాదు.. సరిగ్గా రాసుకుంటే అలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. జస్ట్ ఫోకస్ చేయాలంతే.