స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా జాక్. కొంచె క్రాక్ అనేది క్యాప్షన్. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఈ నెల 10న విడుదల కాబోతోన్న జాక్ ట్రైలర్ వచ్చేసింది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ తో చాలా చాలా ఇంప్రెస్ చేసిన టీమ్.. ఎక్స్ పెక్ట్ చేసిన కంటెంట్ తోనే ట్రైలర్ తో వచ్చింది. టీజర్ లో సిద్ధు క్యారెక్టర్ ఏంటీ అనేది కొంత కన్ఫ్యూజింగ్ గా చెప్పినా.. కొన్ని షాట్స్ చూస్తే అతనో ఏజెంట్ గా నటించాడు అనేది చూచాయగా తెలిసింది. ఇక ట్రైలర్ తో అది నిజమే అని తేలిపోయింది.
ఓ ఏజెన్సీలో జాబ్ కోసం ట్రై చేస్తాడు జాక్. అది వచ్చిందా లేదా అనేది సస్పెన్స్ లో పెట్టారు ట్రైలర్ లో. మరో వైపు దేశం నలుమూలలా విధ్వంసానికి పన్నాగం చేస్తోన్న నలుగురు టెర్రరిస్ట్ లను పట్టుకునేందుకు ప్రకాష్ రాజ్ ఆధ్వర్యంలో ఓ టీమ్ ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ వారికంటే ముందే జాక్ సదరు టెర్రరిస్ట్ లను పట్టేసుకుంటుంటాడు. ప్రకాష్ రాజ్ టీమ్ లో లేని జాక్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది ఓ డౌట్. అందుకే ఆ టెర్రరిస్ట్ లతో పాటు జాక్ ను కూడా పట్టుకోమని తన టీమ్ కు ఆర్డర్ వేస్తాడు. మరి ఈ టెర్రరిస్ట్ ల ప్లాన్ ఏంటీ..? తను ఏం చేస్తున్నాడో తెలియని తండ్రిని జాక్ ఎలా మేనేజ్ చేస్తాడు. తన లవ్ స్టోరీ ఎక్కడి వరకూ వచ్చింది..? జాక్ పనిచేస్తోన్న ఏజెన్సీ పేరేంటీ అనే ప్రశ్నలతో ట్రైలర్ ముగుస్తుంది.
కథ ఇదీ అనేది క్లారిటీగా తెలుస్తూనే ఉంది ట్రైలర్ చూస్తే. బట్ కథనంతో కట్టిపడేలా ఉన్నారు. ఎప్పట్లానే సిద్ధు తనదైన ఎనర్జీతో అదరగొట్టాడు. ప్రకాష్ రాజ్ తో ఉన్న సీన్ లో తన మిషన్ పేరు ‘ఆపరేషన్ బట్టర్ ఫ్లై’ మరి మీ మిషన్ పేరేంటీ అంటాడు. దానికి ప్రకాష్ రాజ్ ‘ఆపరేషన్ రెడ్ థండర్’అంటాడు. ఛండాలంగా ఉంది.. థండర్ ఎక్కడైనా రెడ్ గా ఉంటుందా అని చెప్పడం బావుంది. ఈ సారి వైష్ణవితో లిప్ లాక్ పెట్టేశాడు. మొత్తంగా టైటిల్ లోని క్యాప్షన్ కు తగ్గట్టుగా క్రాక్ గానే కనిపిస్తోంది సిద్ధు క్యారెక్టరైజేషన్. అతని ఖాతాలో మరో హిట్ పడేలానే ఉందనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటే.