Rishab Shetty : 'కాంతారా' హీరో ప్రేమ కథ.. ప్రగతి ప్రేమలో రిషబ్
Rishab Shetty : ప్రేమకథలు వినడానికి ఎప్పుడూ అందంగానే ఉంటాయి. ప్రేమికుల రోజున వాటిని గుర్తు చేసుకుని పరవశించి పోతుంటారు;
Rishab Shetty: ప్రేమకథలు వినడానికి ఎప్పుడూ అందంగానే ఉంటాయి. ప్రేమికుల రోజున వాటిని గుర్తు చేసుకుని పరవశించి పోతుంటారు పెళ్లితో తమ బంధాన్ని పెన వేసుకున్న ప్రేమ జంటలు. అలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవలసింది కాంతారా సినిమాతో ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించిన నటుడు రిషబ్ శెట్టి. చూడ్డానికి సాదా సీదాగా కనిపించినా అతడి జీవితంలో కూడా ఓ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ప్రగతి శెట్టి, రక్షిత్ శెట్టి అభిమాని కావడంతో, అతడి దర్శకత్వంలో వచ్చిన "రికీ" సినిమా చూడటానికి వెళ్ళింది. యాదృచ్ఛికంగా, ప్రగతి ఉన్న థియేటర్‌లో చిత్ర తారాగణం కూడా ఉన్నారు. "రికీ" యూనిట్‌తో ప్రగతి శెట్టికి మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రగతిని చూసిన మొదటి క్షణంలోనే రిషబ్‌కి ఏదో గందరగోళంగా అనిపించింది. అదే కాబోలు తొలి వలపు అలజడి.. అప్పుడే అతడిలో మొదలైంది. ప్రగతిని ఎక్కడో చూసినట్లు అనిపించడం.. ఏదో జన్మలో అనుబంధంగా అతడికి అనిపించింది. సోషల్ మీడియా వారిద్దరి ప్రేమకు మార్గం సుగమం చేసింది.
ఫేస్‌బుక్ ఫాలోవర్స్ లిస్ట్‌లో ప్రగతి పేరు కనిపించింది. ఇంకేం ఉంది ఇద్దరూ సోషల్ మీడియా ద్వారా ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవడం ప్రారంభించారు. ఒక సంవత్సరం గడిచిన తరువాత ఇద్దరి మధ్యా పెళ్లి చర్చ మొదలైంది. రిషబ్ సినిమా నేపథ్యం కారణంగా ప్రగతి కుటుంబం మొదట్లో విముఖత చూపింది. అయినా వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని వివాహంతో ముడిపెట్టాలనుకున్నారు. పెద్దలను ఒప్పించి 2020లో పెళ్లి చేసుకున్నారు.
చిత్ర సీమలో రిషబ్ నటుడిగా, దర్శకుడిగా బిజీగా ఉండడంతో, అతడికి అండగా నిలబడాలనుకుంది ప్రగతి.. అందుకే తాను చేస్తున్న ఐటీ ఉద్యోగానికి స్వస్తి చెప్పింది. తన భర్త అభివృద్ధిని తన అభివృద్ధిగా భావించింది. అతని అన్ని ప్రయత్నాలలో అతనికి అండగా నిలుస్తానని పెళ్లినాడే ప్రమాణం చేసింది. అందుకు అనుగుణంగానే నడుచుకుంది. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు చిన్నారులు వారి జీవితంలోకి ప్రవేశించారు. ముచ్చటైన ఈ జంటను చూసి మురిసిపోతుంటారు రిషబ్ ఫ్యాన్స్.