Kesari Chapter 2 : ఛావానే పట్టించుకోలేదు.. కేసరిని చూస్తారా.?

Update: 2025-05-15 09:45 GMT

ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో డబ్ చేయడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అయితే అన్ని సినిమాలూ వర్కవుట్ కావు. కొన్నిటికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఊహించని విజయాలు సాధించే డబ్బింగ్ మూవీస్ కూడా ఉంటాయనుకోండి. అదే టైమ్ లో ఒరిజినల్ లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న సినిమాల్లో కొన్ని డబ్బింగ్ అయ్యాక తుస్సుమన్న సందర్భాలూ చూశాం. అందుకు ఈ మధ్య కాలంలోనే వచ్చిన ‘ఛావా’ ఒక ఉదాహరణ. హిందీలో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఛావా.. తెలుగులో వచ్చేసరికి తేలిపోయింది. ఆ భావోద్వేగాలేవీ తెలుగులో వర్కవుట్ కాలేకపోయాయి.

అయినా ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమా వస్తోంది. అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే, రెజీనా కసాండ్రా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో బ్రిటీష్ జనరల్ డయ్యర్ జరిపిన అమానుష కాండపై సాగే కోర్ట్ రూమ్ డ్రామా. ఆ కాలంలో జనరల్ డయ్యర్ పై కేస్ వేసి అతన్ని దోషిగా నిరూపించే ప్రయత్నాన్ని ఈ చిత్రంలో చూపించారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఓ మోస్తరు విజయం సాధించింది. అయితే ఇందులోనూ దేశభక్తి కోసం అంటూ ఈ కాలంలోని కొందరు నాయకులను సంతృప్తి పరిచే సన్నివేశాలను ‘ఇరికించారు’. దీనిపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో అనువదించి ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు.

కరణ్ సింగ్ త్యాగీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం రివ్యూస్ కూడా అంత గొప్పగా ఏం లేవు. అయినా తెలుగులో డబ్ చేయడం వెనక కారణమేంటో కానీ.. ఛావానే చూడని మనాళ్లు ఇప్పుడు అసలే ఫామ్ లో లేని అక్షయ్ కుమార్ మూవీని చూస్తారా.. పైగా అతనికి తెలుగులో అసలు ఫ్యాన్ బేస్ కూడా లేదు. ఏదేమైనా ఇదో రాంగ్ ఛాయిస్ అనేవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటి వారి అంచనాలను దాటుకుని ఈ కేసరి చాప్టర్ 2 విజయం సాధిస్తే విశేషమే మరి.

Tags:    

Similar News