శాండల్ వుడ్ అంటే రెండు దశాబ్దాలుగా రీమేక్ లతో నిండిపోయింది. అందుకే అక్కడి సినిమా ఇతర ప్రపంచానికి పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ కనెక్షన్ ను పెంచే సినిమాలు అప్పుడప్పుడూ వచ్చినా.. మొత్తం గేమ్ ను మార్చింది కేజీఎఫ్ రెండు చాప్టర్లు. తర్వాత వచ్చిన కాంతార శాండల్ వుడ్ స్టాండర్డ్స్ ను దేశానికి పరిచయం చేసింది. అయితే అక్కడ కేజీఎఫ్ వచ్చిన దగ్గర్నుంచీ ఇతర హీరోలంతా ఆ ఫార్మాట్ లోనే సినిమాలు చేయాలని ప్రయత్నించి బోల్తా పడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన బఘీరాది అదే దారి. తాజాగా కన్నడ టాప్ హీరో సుదీప్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అతని కొత్త సినిమా ‘మ్యాక్స్’ఈ నెల 27న విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ కార్తికేయా డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.
మ్యాక్స్ మూవీ ట్రైలర్ చూస్తే మాగ్జిమం మూవీస్ గుర్తొస్తున్నాయి. నగరంలో కిడ్నాపులు జరుగుతుంటాయి. పోలీస్ లు కూడా హెల్ప్ లెస్. అటు రాజకీయ నాయకుల స్వైర విహారం. కట్ చేస్తే ఒక్క రాత్రిలో అంతా సెట్ చేసే అతి బలవంతుడైన హీరో. ట్రైలర్ లో మేకింగ్, టేకింగ్ చూస్తుంటే కేజీఎఫ్ నుంచి ఖైదీ వరకూ కనిపిస్తున్నాయి. అక్కడక్కడా విక్రమ్ ను కూడా గుర్తు చేస్తుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం కూడా అదే కోవలో కనిపిస్తోంది. ముందుగా ప్యాన్ ఇండియా విడుదల అన్నారు. మరి ఏమైందో ఆ సౌండేం లేదు. కేవలం కర్ణాటకలో మాత్రమే విడుదల చేసి రిజల్ట్ తెలిసిన తర్వాత ఆ రిజల్ట్ ను పట్టుకుని ఇతర భాషల్లో విడుదల చేస్తారేమో కానీ.. ఈ ట్రైలర్ చూస్తే వెరీ రొటీన్ అన్నట్టుగా ఉంది. చాలా సినిమాలను గుర్తుకు తెస్తోందంటున్నారు చాలామంది. మన సునిల్ ప్రధాన విలన్ గా కనిపిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త హోర్నాడ్, శుక్రుత వాలే ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
కేజీఎఫ్ తర్వాత సుదీప్ కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ లో అడుగుపెట్టాలని ఆరాటపడుతున్నాడు. ఈ మేరకు చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆ మధ్య విక్రాంత్ రోణతో ప్రయత్నించాడు. కానీ అందులో పాట హిట్ అయినట్టుగా సినిమా ఆకట్టుకోలేదు. అంతకు ముందు పైల్వాన్ అన్నాడు కానీ అదీ పోయింది. మొత్తంగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని తపిస్తే కాదు.. మంచి సినిమా చేస్తే అదే ప్యాన్ ఇండియా మూవీ అవుతుందన్న సీనియర్ డైరెక్టర్ మాటలు సుదీప్ విషయంలో నిజం అవుతున్నాయి.