ఫ్లాపులు పాఠాలు నేర్పుతాయి. హిట్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెబుతాయి. కొన్నాళ్ల క్రితం అందరికీ ఈజీ టార్గెట్ అయిన కిరణ్ అబ్బవరం ‘క’ మూవీతో ఓవర్ నైట్ అందరికీ ఫేవరెట్ అయిపోయాడు. అతన్ని ట్రోల్ చేసిన వాళ్లు కూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. మొన్నటి వరకూ అతని సినిమాల ఫంక్షన్స్ కు గెస్ట్ గా రావడానికి ఇష్టపడని వాళ్లు ఇప్పుడు అతని విజయాన్ని అభినించేందుకు వస్తున్నారు. ఇండస్ట్రీ తీరే అంత కాబట్టి అది తెలుసుకుని అడుగులు వేస్తే బెటర్ అనేది కొత్తవాళ్లు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠం.
ఇక క వంటి పెద్ద హిట్ కొట్టిన తర్వాత కిరణ్ అబ్బవరం తర్వాత సినిమా ఏంటీ అనే ప్రశ్న అందరిలోనూ కనిపిస్తుంది. అయితే ఆ ప్రశ్నకు సమాధానం సులువుగానే దొరకొచ్చేమో కానీ ఈ హిట్ పరంపరను కంటిన్యూ చేయడం అంత సులువేం కాదు. అయినా కిరణ్ నెక్ట్స్ మూవీ ఏంటీ అంటే.. గతంలోనే ఒప్పుకున్న సినిమా తెరమీదకి వచ్చింది. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడితో ఇంతకు ముందే అతను ‘దిల్ రుబా’ అనే సినిమా చేశాడు. అంతకు ముందు అతని మార్కెట్ రేంజ్ కు భయపడి ఈ మూవీని ఆపేశారు. ప్రస్తుతం హిట్టు కొట్టాడు కాబట్టి ఈ మూవీకి కొత్త రెక్కలు వస్తాయి. కొనేవాళ్లు ధైర్యంగా ఉంటారు. అందుకే ఈ ప్రాజెక్ట్ ను తెర ముందుకు తెస్తున్నారు. పూర్తి ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. మరి ఈ మూవీ రిలీజ్ కు సంబంధించిన డీటెయిల్స్ ను త్వరలోనే ప్రకటిస్తారట. బట్ ఇది క రేంజ్ హిట్ కాకపోయినా ఫ్లాప్ టాక్ తెచ్చుకోకుండా ఉండాలి. అప్పుడే కిరణ్ దూకుడు కంటిన్యూ అవుతుంది.