Dhanush Birthday Special: ధనుష్ పుట్టినరోజు స్పెషల్: నటుడు కాకపోతే మాస్టర్ చెఫ్‌గా.. బలవంతంగా రంగుల ప్రపంచంలోకి..
Dhanush Birthday Special: నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'వై దిస్ కొలవెరి డి' పాటతో నటుడు ధనుష్ రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకున్నాడు.;
Dhanush Birthday Special: నటుడు ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'వై దిస్ కొలవెరి డి' పాటతో నటుడు ధనుష్ రాత్రికి రాత్రే పాపులారిటీ సంపాదించుకున్నాడు. 2011లో విడుదలైన ఈ పాట యావత్ భారత దేశాన్ని ఒక ఊపు ఊపింది. తానే స్వయంగా ఈ పాట రాసి పాడాడు ధనుష్. ఈ పాపులర్ పాటను కేవలం ఆరు నిమిషాల్లో రాసి 35 నిమిషాల్లో మొదటి రికార్డింగ్ పూర్తి చేశాడు. ఈ పాట పాడిన రెండేళ్ల తర్వాత ధనుష్‌కి బాలీవుడ్‌లో కూడా అవకాశాలు వచ్చాయి.
ధనుష్ అసలు పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆయన పూర్తి పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. 2002లో 'తుల్లోవాడో ఇలిమై' అనే తమిళ చిత్రం ద్వారా ధనుష్ తెరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో ధనుష్ నటనకు ప్రశంసలు అందాయి.
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ధనుష్ 2004లో వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం వారిద్దరికీ 'యాత్ర', 'లింగ' అనే ఇద్దరు కుమారులు కలిగారు. వివాహమైన 18 ఏళ్ల తర్వాత ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో తమ సంబంధాన్ని ముగించామని సోషల్ మీడియాలో ప్రకటించారు. ధనుష్ ప్రస్తుతం తన హాలీవుడ్ చిత్రం ది గ్రే మ్యాన్ గురించి చర్చలు జరుపుతున్నాడు. ఈ సినిమా ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ధనుష్ తెరపై ఎలాంటి పాత్ర చేసినా అందులో పూర్తిగా ఒదిగిపోతాడు. అతని నటనకు అభిమానులు ఫిదా అవుతారు. ఈరోజు ధనుష్ పుట్టినరోజు. ఈ ప్రత్యేక సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. తన నటనతో అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్న ధనుష్ నటుడిగా ఎదగాలని అనుకోలేదు. ఈ విషయం నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది మాత్రం నిజం. అతడు ఈ రంగంలోకి బలవంతంగా వచ్చాడు. కానీ ఎందుకు? తెలుసుకుందాం...
ధనుష్‌కి వంట చేయడం అంటే చాలా ఇష్టం, సంగీతం పట్ల కూడా ఆసక్తి ఉంది. కానీ, అతడికి నిజజీవితంలో ఉన్న ఆసక్తి ఇతరులకు వండి పెట్టడం. అతను కూడా తన అభిరుచిని వృత్తిగా చేసుకోవాలనుకున్నాడు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి చెఫ్‌గా మారాలనుకున్నాడు. కానీ, దర్శకుల కుటుంబంలో పుట్టిన ధనుష్ కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా నటరంగంలోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. అతని మొదటి చిత్రం అతని తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించిన 'తుళ్లువదో ఇలామై' (2002).
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఉన్న వారిలో ధనుష్ ఒకరు. 'నటనంటే ఆసక్తి లేని నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.. నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, నాతో పనిచేసిన దర్శకనిర్మాతలు, అభిమానులు' అని చెప్పే నిరాడంబరుడు ధనుష్‌కి జన్మదిన శుభాకాంక్షలు.