MAA Elections 2021: 'మా' పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. పోలీసుల జోక్యం..
MAA Elections 2021: ఇక మా ఎన్నికలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీట్ పెంచుతోంది.;
MAA Elections 2021: ఇక మా ఎన్నికలు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీట్ పెంచుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటికే సినీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్, మోహన్‌బాబు, రామ్‌చరణ్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఉదయమే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఇద్దరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు కరచాలనం చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్.. మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు.. విష్ణుతో ప్రకాశ్‌రాజ్‌కు కరచాలనం చేయించారు. తర్వాత విష్ణు-ప్రకాశ్‌రాజ్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. మరోవైపు మా ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ తీరుపై మంచు విష్ణు మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు. మా ఎన్నికలపై స్పందించారు చిరంజీవి.
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎలక్షన్స్ జరుగుతాయని అనుకోవటం లేదన్నారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు చిరంజీవి. ఓటు వేసిన అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... సినీపరిశ్రమలో వర్గాలు అనేవిలేవని, అందరం కలిసే ఉంటామన్నారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ఇండస్ట్రీ చీలిపోతుందనే ప్రశ్న లేదని చెప్పారు. ఎప్పుడు లేని.. హడావుడి అవసరమా అనిపించిందన్నారు పవన్‌కల్యాణ్.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో మొత్తం 925మంది సభ్యులు ఉన్నారు. ఓటు హక్కు ఉన్న 883 మంది సభ్యులకు సుమారు 500లకు పైగా ఈ ఎన్నికల్లో ఓటు వినియోగించుకునే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్ జరగనుండగా, సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ కో-ఆపరేటివ్ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో పోలింగ్ జరుగుతోంది. రాత్రి 8గంటల తర్వాత 'మా' అధ్యక్షుడి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.