ఈ మధ్య ఇళయరాజా తన వర్క్ కంటే ఎక్కువగా కోర్ట్ విషయాల్లోనే జనాల్లో ఉంటున్నాడు. మైత్రీ, మద్రాస్ అని ఇళయరాజా గురించి చెబుతున్నారేంటీ అనుకుంటున్నారేమో. ఇది ఇళయరాజా పనే. యస్.. కొన్ని రోజుల క్రితం మైత్రీ మూవీ మేకర్స్ తమిళ్ లో టాప్ హీరోస్ లో ఒకడైన అజిత్ తో ఓ సినిమా నిర్మించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ తో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులు పట్టించుకోలేదు కానీ.. తమిళ్ లో హిట్ అయింది. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో త్రిష, అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్, సిమ్రన్ కీలక పాత్రల్లో నటించారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. అయితే సినిమాలో అనేక సన్నివేశాల్లో ఇళయరాజా స్వరపరిచిన పాటలు వినిపిస్తాయి. అవన్నీ తమిళ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి.
అసలే ఇళయరాజా తన పర్మిషన్ లేకుండా వేదికలపై పాడాడు అని ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపైనే కేస్ వేసిన వాడాయె. అందుకే ఈ విషయంపై వివరణ ఇవ్వాలని గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ను అడిగాడు. అయితే వారు చెప్పిన సమాధానం తనకు సంతృప్తి కరంగా లేదు అని మద్రాస్ కోర్ట్ లో కేస్ వేశాడు. తన పర్మిషన్ లేకుండా వాడిన పాటలను సినిమా నుంచి తొలగించాలని.. అంత వరకూ ఆ సినిమాను ఎక్కడా ప్రదర్శించకూడదని ఆర్డర్ ఇవ్వాలని కోరాడు. మద్రాస్ కోర్ట్ అలాగే చేసింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి ఇళయరాజా పాటలను తొలిగించేంత వరకూ లేదా.. ఇళయరాజా పర్మిషన్ వచ్చే వరకూ ఆ చిత్రాన్ని ఇకపై ఎక్కడా విడుదల చేయకూడదని, ప్రదర్శించ కూడదని.. ఓటిటిల్లో సైతం నిలిపివేయాలని మైత్రీ వారికి ఆర్డర్స్ జారీ చేసింది. మామూలుగా అయితే ఇలాంటి వాటికి రాజా రాయల్టీ కోరతాడు. ఆ రాయల్టీ విషయంలోనే మైత్రీకి, రాజాకు చెడినట్టుంది. అందుకే కోర్ట్ కు వెళ్లాడు. ఏదేమైనా కొన్నాళ్లుగా ఇళయరాజా తన పాటలను వాడిన వారి నుంచి ముక్కుపిండి మరీ రాయల్టీ వసూలు చేస్తున్నాడు. మరి ఈ విషయంలో మైత్రీ వాళ్లు కాంప్రమైజ్ అవుతారా లేక సుప్రీమ్ కోర్ట్ కు వెళతారా అనేది చూడాలి.