Mahesh Babu: మహేష్ బాబుకు మాతృవియోగం..
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.;
Indira Devi: సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఇందిరాదేవి. అభిమానుల సందర్శనార్థం.. ఇందిరాదేవి భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించారు. అనంతరం మహాప్రస్తానంలో ఇందిరాదేవి అంత్యక్రియలు జరగనున్నాయి. అటు ఇందిరాదేవి మరణంతో టాలీవుడ్‌లోనూ విషాదం నెలకొంది.
ఇందిరాదేవి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ, కాంగ్రెస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శైలజానాథ్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహేశ్‌బాబు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ మామకూతురే ఇందిరాదేవి. వరుసకు మరదలు అవుతుంది. అప్పుడప్పుడే సినిమాల్లో రాణిస్తున్న కృష్ణకు.. కుటుంబ సభ్యులు ఇందిరా దేవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఇందిరతో వివాహం అయిన తర్వాతనే గూడాచారి చిత్రంతో కృష్ణకు బంఫర్ హిట్ వచ్చింది. ఈ ఒక్క విజయంతో కృష్ణకు ఆఫర్లు వెళ్లువెత్తాయి.
కృష్ణ, ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. వారిలో రమేష్ బాబు పెద్ద. ఆ తరువాత మంజుల, ప్రియదర్శిని, పద్మావతి, మహేష్‌బాబుకు జన్మనిచ్చారు. కృష్ణ ఫ్యామిలీలో చాలా మంది సినీరంగంలోకి వచ్చినప్పటికీ.. ఇందిరా దేవి మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. ఫంక్షన్లలోనూ చాలా అరుదుగా కనిపించారు.
సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు తల్లి ఇందిరాదేవి అంటే చాలా ఇష్టం. పెళ్లికి ముందు తల్లి చాటు బిడ్డగానే పెరిగాడు మహేష్. అటు మంజులకు కూడా అమ్మ ఇందిరాదేవి అంటే ఎంతో ప్రేమ. అందుకే తన ప్రొడక్షన్ హౌస్‌కు ఇందిర ప్రొడక్షన్స్ అని పేరు పెట్టుకున్నారు.
కృష్ణకు ఇందిరాదేవితో వివాహమైన నాలుగేళ్లకు విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నారు. అయినా సరే.. కృష్ణతోనే ఉంటానని చెప్పారు ఇందిరాదేవి. విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ.. కృష్ణ కూడా ఇందిరను ఏనాడు ఇబ్బంది పెట్టలేదని సన్నిహితులు చెబుతుంటారు. కుటుంబ సభ్యులు కొందరు కృష్ణను తప్పుబట్టే ప్రయత్నం చేయబోయినప్పటికీ.. ఇందిరనే కృష్ణను వెనకేసుకొచ్చేవారని చెబుతుంటారు. కృష్ణ ఏమీ తప్పు చేయలేదని, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కనుక ఎవరూ ఏమీ అనొద్దంటూ ఇందిర మద్దతుగా నిలిచిన సందర్బాలు చాలా ఉన్నాయంటున్నారు సన్నిహితులు.