Manchu Manoj : రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు

Update: 2024-12-16 06:30 GMT

ఈ మధ్య కాలంలో కుటుంబ తగాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది మంచు ఫ్యామిలి. ఆస్తి తగాదాలు అన్నారు.. ఆధిపత్య పోరాటం అన్నారు.. ఒకరు ఆత్మ గౌరవ పోరాటం అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. మోహన్ బాబు ఓ టివి ఛానల్ జర్నలిస్ట్ పై చేసిన దాడి మరింత రచ్చ అయింది. ఆయనపై పోలీస్ కేస్ లు నమోదయ్యాయి. అయితే మనోజ్ పై మొదటి నుంచి సోషల్ మీడియాలో ఓ సింపతీ కార్డ్ కనిపించింది. ఈ గొడవ కూడా అతను రెండో పెళ్లి చేసుకోవడం.. ఆ పెళ్లి ఇంట్లోవారికి ఇష్టం లేకపోవడం అంటారు. మొత్తంగా ఓ వారం రోజులు సాగిన మంచు మంటల ప్రహసనం ఓ కొలిక్కి వచ్చిందనే అనుకుంటున్నారు. పైగా మోహన్ బాబు తాజాగా తను దాడి చేసిన జర్నలిస్ట్ ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు కూడా కోరాడు.

అయితే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి మరో హాట్ టాపిక్ స్టార్ట్ అయింది. మనోజ్ దంపతులు రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారని. అది కూడా జనసేన పార్టీలోకి అంటున్నారు. మంచు ఫ్యామిలీ మొదట చంద్రబాబు నాయుడు సన్నిహితంగా ఉంది. ఆ తర్వాత వైఎస్ జగన్ కు అనుకూలంగా మారారు. విష్ణు భార్యకు జగన్ ఫ్యామిలీతో బంధుత్వం కూడా ఉంది. ఇటు మనోజ్ భార్య మౌనిక ఫ్యామిలీ తెలుగు దేశం పార్టీ నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరింది. అయితే ఈ రెండు పార్టీలూ కాదని మనోజ్ దంపతులు జనసేనను ఎంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం జనసేనకు ఏపిలో భవిష్యత్ కనిపిస్తోంది. అందులోనే తమ రాజకీయ భవిష్యత్ ను వీళ్లు వెదుక్కోబోతున్నారు అనుకోవచ్చు. ఇవాళ (సోమవారం) మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆళ్లగడ్డలో తమ రాజకీయ అరంగేట్రం గురించిన అప్డేట్ ఇవ్వబోతున్నారు వీళ్లు. ఇందుకోసం వందల కార్లతో ర్యాలీగా వెళ్లాలనుకుంటున్నారట. మరి వీరికి జనసేన నుంచి ఎలాంటి స్వాగతం దక్కుతుందో చూడాలి. 

Tags:    

Similar News