సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని వరించింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 8న జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
మిథున్ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం ప్రారంభించారు. నటుడిగా, నిర్మాతగా సేవలందించారు. డిస్కో డాన్సర్ చిత్రం ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక సినీ రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ ఏడాది జనవరిలో ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా అందజేసింది. ఇప్పుడు దాదా సాహెబ్‌తో సత్కరించనుంది.