లెజెండరీ తెలుగు దర్శకుల జాబితాలో ఖచ్చితంగా ఉండే పేరు ముత్యాల సుబ్బయ్య. ఈయన పేరు వినగానే సకుటుంబ కథలతో, సెంటిమెంట్ రంగరించిన సినిమాలే ఎక్కువ గుర్తొస్తాయి. నైన్టీస్ లో వరుస ఫ్లాపులతో చిరంజీవి కెరీరే ప్రమాదంలో పడినప్పుడు హిట్లర్ మూవీతో ఆయన కెరీర్ ను కొత్త మలుపు తిప్పిన దర్శకుడు ఆయనే. రాజశేఖర్ ను స్టార్ హీరోగా నిలపడంలో సుబ్బయ్యే అగ్రస్థానం. ఆ తర్వాత టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేసి చాలా ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు ఆయన. అందరినీ గురువా అని పిలుస్తూ ఏ మాత్రం అహం ప్రదర్శించని ఉత్తమ వ్యక్తిత్వం కూడా ఆయన సొంతం. సినిమా పరిశ్రమ మారింది. మేకింగ్ స్టైల్ మారింది. అందుకే పాత తరం దర్శకులను కొత్తవాళ్లు పట్టించుకోవడం లేదు. ఈ ట్రెండ్ లోనే వెనకబడిపోయి ప్రస్తుతం విశ్రాంతి దశలో ఉన్న సుబ్బయ్య గారు ఈ వయసులో అవసరం లేని రిస్క్ చేస్తున్నారు. అదే సినిమా నిర్మాణం.
ఆయన తనయుడు ముత్యాల అనంత కిశోర్ ను ముందు పెట్టి ఈయన నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ ను స్థాపించి రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజ్ జంటగా ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాం అని చెబుతున్నారు. ఈ చిత్రంతో వి శ్రీనివాస్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.
అయితే ఒకప్పుడు నిర్మాత తర్వాతే ఎవరైనా అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అందరి తర్వాతే నిర్మాత అయ్యాడు. ప్రొడ్యూసర్ అంటే క్యాషియర్ మాత్రమే అనే కాలంలో ఉన్నాం. ఈ కాలంలో ముత్యాల సుబ్బయ్య లాంటి సాఫ్ట్ పర్సన్ నిర్మాతగా మారడం ఖచ్చితంగా రిస్కే. పైగా ఇక్కడి వ్యాపారంలో తన మన ఉండదు. పాత కొత్తా ఉండదు. ఎవడికి వాడు అందిన కాడికి దండుకోవడమే లక్ష్యంగా ఉంటారు. ఇక సినిమా చేయడం కంటే రిలీజ్ చేయడం అతి పెద్ద టాస్క్. ఈ టాస్క్ లో ముత్యాల సుబ్బయ్య లాంటి వాళ్లు నెగ్గుతారు అనుకోవడం పొరబాటే అని చెప్పాలి. పైగా జీవితాంతం సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోగొట్టుకున్నవాళ్లను ఆయనే ఎంతోమందిని చూసి ఉంటారు. ఏదేమైనా చాలా పెద్ద రిస్కీ జాబ్ లోకి ఎంటర్ అవుతున్న ముత్యాల సుబ్బయ్య విజయం సాధించాలనే కోరుకుందాం.