ఏ నటుడికైనా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటేనే ఆడియన్స్ ఆదరిస్తారు. లేదంటే మాత్రం జనం లైట్ తీసుకుంటారు. ఈ విషయంలో చాలాకాలం పాటు ఇండస్ట్రీలోనే ఉన్న కళ్యాణ్ రామ్ చాలా వెనకబడే ఉన్నాడు అనేది నిజం. ఆయన కెరీర్ ఎప్పుడూ నిలకడగా లేదు. హిట్ రేషియో చాలా అంటే చాలా తక్కువ. చెప్పడానికి 2003లో హీరోగా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ కెరీర్ మొదలు పెట్టి 23 యేళ్లు అవుతున్నా.. విజయాల విషయం మాత్రం చేతిలో లెక్కపెట్టేన్ని మాత్రమే ఉన్నాయి. తొలి చూపులోన మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. అది పోయింది. తర్వాత అభిమన్యుడు వచ్చింది.. అదీ పోయింది. దీంతో తనే నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా అతనొక్కడే పెద్ద విజయం సాధించింది. దీంతో కెరీర్ గాడిలో పడుతుంది అనుకున్నారు. తర్వాత చేసిన అసాధ్యుడుకు ఓపెనింగ్స్ వచ్చాయి తప్ప విజయం మాత్రం పూర్తిగా దక్కలేదు. ఆ తర్వాత ఎన్నో మూవీస్ లో ప్రయత్నించాడు. ప్రయోగాలు చేశాడు. నిర్మాతగా భారీగా లాస్ అవుతున్నా.. సినిమాలు మాత్రం ఆపలేదు.
2006లో చేసిన అసాధ్యుడు తర్వాత 2015లో వచ్చిన పటాస్ తో పెద్ద హిట్ అందుకున్నాడు. ఈ మూవీ టెంపర్ కు దగ్గరగా ఉంది అనే టాక్ ఉన్నా.. వసూళ్లు ఆగలేదు. లేదంటే టెంపర్ లా లేకపోతే ఇంకా చాలా పెద్ద విజయం వచ్చేది. ఆ తర్వాత చేసిన మూవీస్ కూడా అన్నీ పోయాయి. 2019లో వచ్చిన 118 మూవీ కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఆపై 2022లో వచ్చిన బింబిసార చాలా పెద్ద విజయం సాధించింది. అంతే.. ఆ తర్వాత మరో హిట్ పడలేదు. చివరిగా 2025లో చేసిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆ తర్వాత మూవీస్ విషయంలో కామ్ అయిపోయాడు కళ్యాణ్ రామ్. ఇప్పటి వరకు కొత్త సినిమా విషయంలో ఓ క్లారిటీ లేకుండా పోయాడు. అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ కూడా వచ్చింది చాలామందికి. మరికొందరైతే నిర్మాతగా ఉంటూ.. ఎన్టీఆర్ మూవీస్ లో నిర్మాణ భాగస్వామిగా మిగిలిపోవడం బెటర్ అనే కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూసినా అతను సరైన కథలు మాత్రం ఎంచుకోలేకపోయాడు. ఆ కారణంగానే దారుణమైన పరాజయాలు చూశాడు. మరి ఇప్పటితో హీరోగా కెరీర్ ముగిసినట్టేనా లేక మళ్లీ పుంజుకుంటాడా అనేది తేలాల్సి ఉంది. లేదంటే ఏదైనా ఇతర పాత్రలకు మళ్లుతాడా అనేది కూడా చూడాలి.