2023లో మ్యాడ్ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. అయితే ఎన్టీఆర్ పేరును ఎక్కువగా వాడుకోలేదు. తనకు తానుగానే నిలబడే ప్రయత్నం చేస్తున్నాడని ఈ ఆగస్ట్ లో విడుదలైన ఆయ్ మూవీ చూస్తే అర్థం అయింది. ఈ రెండు సినిమాలతో హిట్ అందుకుని మంచి ఓపెనింగ్ అనిపించుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇలా హీరోల తమ్ముళ్లు, ఇతర వరసలు ఉన్న కుర్రాళ్లు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన సందర్భాలు లేవనే చెప్పాలి. అది నితిన్ కు ప్లస్ అయింది. మ్యాడ్ లో నలుగురులో ఒకడుగా ఉన్నాడు అన్నారు. కానీ ఆయ్ లో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నా.. తను బాగానే ఆకట్టుకున్నాడు. మరీ అందగాడేం కాకపోయినా బ్యాక్ గ్రౌండ్ ఉంది, దీనికి తోడు వరుస విజయాలు పడుతున్నాయి కాబట్టి పాసై పోవచ్చు.
ఆయ్ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. అందుకే వెంటనే మరో మూవీతో వస్తున్నాడు. నిజానికి ఇదే ముందు అనౌన్స్ అయిందంటారు. కానీ మూడో సినిమాగా వస్తోంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పేరు ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. చింతపల్లి రామారావు నిర్మాత. హీరోయిన్ గా సంపద అనే అమ్మాయి పరిచయం అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని దసరా బరిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. దసరాకు తెలుగు నుంచి విశ్వం, జనక అయితే గనక అనే చిత్రాలున్నాయి. బట్ రజినీకాంత్ వేట్టైయాన్ కూడా ఉంది. అయినా ధైర్యం చేస్తున్నారంటే కంటెంట్ పై నమ్మకమే అనుకోవాలి. ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే కంప్లీట్ ఫామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. మంచి ఎమోషన్ కూడా ఉంటే దసరా హాలిడేస్ లో వర్కవుట్ అయిపోతుంది. మొత్తంగా ఎన్టీఆర్ బావమరిది దూకుడుగానే ఉన్నాడు. మరి ఈ మూవీతో హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి.