Kumara Swamy : 2024లో అదరగొట్టిన కొత్త దర్శకులు

Update: 2024-12-28 09:16 GMT

ప్రతి యేడాదీ చాలామంది దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతుంటారు. కానీ వారిలో కొందరే తమదైన ముద్ర వేస్తారు. ఆ ముద్ర టాలీవుడ్ లో రిజిస్టర్ అయితే మరిన్ని సినిమాలు వస్తాయి. తద్వారా వాళ్లు మరిన్ని కథలు చెప్పగలుగుతారు. ఈ యేడాది కూడా కొత్తవాళ్లు బాగా మెరిశారు. పైగా అందరివీ కొత్త తరహా కథలు, కథనాలు. ఎమోషన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ నూ బాగా పండించి ఫస్ట్ మూవీస్ తోనే బెస్ట్ అనిపించుకున్న ఆ దర్శకులెవరో.. వారి ప్రతిభలేంటో చూద్దాం.

విజయ్ బిన్ని :

ఈ యేడాది ఆరంభంలోనే సంక్రాంతి బరిలో విడుదలైన సినిమా నా సామిరంగా. ఈ చిత్రంతో కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా పరిచయం అయ్యాడు విజయ్ బిన్ని. నాగార్జున కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చాడు అంటే వారిలో మేటర్ ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీకి ఇప్పటికే ఎంతోమందిని పరిచయం చేశాడు నాగ్. ఆ నమ్మకాన్ని విజయ్ బిన్ని నిలబెట్టుకున్నాడు. రీమేక్ సినిమానే అయినా మనదైన నేటివిటీని మిక్స్ చేస్తూ.. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో స్నేహం, ప్రేమ, ఎమోషన్స్ నేపథ్యంలో ఓ మంచి కథ చెప్పాడు. పైగా చాలా తక్కువ టైమ్ లో చిత్రాన్ని పూర్తి చేయగలిగాడు. ఫ్యూచర్ లో లారెన్స్ లా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయగల సత్తా ఉన్నవాడుగా నిరూపించుకున్నాడు.

 

ప్రశాంత్ రెడ్డి :

భజే వాయువేగం సినిమాతో ఈ యేడాది మెరిసిన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి. ఈ సినిమా విడుదలకు ముందు అతను చాలా ప్రెస్ మీట్స్ లో తన సినిమా గురించి కాస్త ఎక్కువే చెప్పుకున్నాడు. కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. కాదు కాన్ఫిడెన్సే అని సినిమా చూశాక అర్థం అయింది. కార్తికేయ, రాహుల్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఓ మంచి థ్రిల్లర్ లా అనిపిస్తుంది. అలాగని మరీ సూపర్ థ్రిల్లర్ మీటర్ లో కాకుండా.. సింపుల్ గా వెళుతూ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ను మిక్స్ చేసుకుంటూ ఆకట్టుకుంది. కమర్షియల్ గా కార్తికేయకు మంచి విజయంగా నిలిచింది. ఈ వైవిధ్యమైన కథతో ప్రశాంత్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నాడు.

 

యదువంశీ :

ఈ యేడాది చాలా ఎక్కువ ప్రశంసలు అందుకున్న దర్శకుడు యదువంశీ. కమిటీ కుర్రాళ్లు మూవీతో ఎంతోమందికి నోస్టాల్జిక్ ఫీలింగ్స్ ను మళ్లీ కదిలించాడు. ప్రతి మనిషికీ బాల్యం, పాఠశాల, కళాశాల దశలు అత్యంత మధురమైనవి. మొదటి రెండు దశల్లో ఏర్పడే స్నేహాలు జీవితాంతం ఉంటాయి. అలాంటి కొందరు స్నేహితుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, ఎదురైన సమస్యలు, జీవితంలో ఎదిగేందుకు ఎవరికీ వారే అయినా.. చివరికి వారంతా కలవడానికి ప్రతి ఊరికీ ఎమోషనల్ గా ఉండే జాతరు సెంటర్ పాయింట్ గా తీసుకోవడం.. ఓ రకంగా చాలా పాత్రలను తీసుకున్నాడు. అన్నిటికీ న్యాయం చేశాడు. కొన్నిసార్లు అవసరం లేని కంటెంట్ ను కదిలించాడు అనిపించింది. కానీ దానికి ఎలాంటి కామెంట్ ఇవ్వకుండా సింపుల్ గా ముగించాడు. ఈ సినిమాను నిహారిక నిర్మించడం.. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండటం మరింత కలిసొచ్చింది. ఈ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పరిశ్రమ దృష్టిలో పడ్డాడు యదువంశీ.

 

అంజి మణిపుత్ర :

తన టాలెంట్, విజయానికి తగ్గట్టుగా మాట్లాడుకోకపోయినా.. ఆయ్ మూవీతో ఆకట్టుకున్న అంజి మణిపుత్ర సైతం ప్రామిసింగ్ డైరెక్టర్ అనిపించుకున్నాయి. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న వినోదాత్మక కథను అద్భుతంగా ఫినిష్ చేయడం. క్యాస్ట్ బేస్డ్ లవ్ స్టోరీ అంటే ఏ భాషలో అయినా ఒకే రకంగా ఎండ్ అవుతుంది అనుకుంటన్న టైమ్ లో దానికి ఫాదర్ సెంటిమెంట్ ను జోడించి ఆశ్చర్యంగా ముగించాడు అంజి. రైటింగ్ లో పస ఉందనిపిస్తుంది. క్యారెక్టర్స్ కు క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడంలో అతని కలం పదునుగా కనిపించింది. అదే ఆయ్ తో మంచి విజయాన్ని అందించి.. మరిన్ని విజయాలు అందించగలడు అన్న నమ్మకాన్ని పెంచింది.

 

సుజిత్ - సందీప్

‘క’.. ఈ యేడాది ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాల్లో ఇదీ ఒకటి. కిరణ్ అబ్బవరం.. హిట్ కోసం యుద్ధాలే చేస్తోన్న టైమ్ లో తనే అన్నీ అయ్యి ఈ చిత్రాన్ని ముందుకు తెచ్చాడు. అప్పటి వరకూ దర్శకులు కాస్త వెనకే కనిపించారు. బట్ రిలీజ్ తర్వాత అంతా మాట్లాడుకున్నది ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శక ద్వయం సుజిత్ - సందీప్ గురించే. ఇది కంప్లీట్ గా డైరెక్టర్స్ మూవీ. రైటింగ్, మేకింగ్ టేకింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ తో వాళ్లు రూపొందించిన సినిమా ఇది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ తో ఎంటైర్ టాలీవుడ్ ను సర్ ప్రైజ్ చేశారు. స్క్రీన్ ప్లే పరంగానూ పాత టెక్నిక్ నే కొత్తగా వాడుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే.. వీళ్లు ఇప్పటి వరకూ ఎవరి వద్దా అసిస్టెంట్స్ గా పనిచేయలేదు. తమదైన సొంత తెలివితోనే క లాంటి కథన బలం ఉన్న సినిమాను అందించి శెభాష్ అనిపించుకున్నారు.

 

కుమార స్వామి ( అక్షర) :

2024 ది బెస్ట్ అనిపించుకున్న దర్శకుల్లో ఖచ్చితంగా కనిపించే పేరు కుమార స్వామి అలియాస్ అక్షర. తను రూపొందించిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ఎందరో ఆకట్టుకుంది.. ఆలోచింప చేసింది. ఈ చిత్రంలోని డైలాగ్స్ చూస్తే ఓ వెట్రిమారన్ కనిపిస్తాడు. ఎంచుకున్న కథను చూస్తే.. బాలచందర్ ను తలపిస్తాడు. ఒకప్పుడు మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్నాళ్లుగా ఆ తరహా కథలే రావడం లేదు. ఆ లోటును తీరుస్తూ.. మధ్య తరగతి కుటుంబాల్లో ఆశలు, అడియాశలు, అనుబంధాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ఆడవాళ్లు చూస్తే.. ఇలాంటి భర్త ఉంటే ఇల్లే స్వర్గం అనుకుంటారు. మగవాళ్లైతే ఇలాంటి అర్థం చేసుకునే భార్య ఉంటే ఎన్నైనా సాధించొచ్చు అనుకుంటాడు. ఆ స్థాయిలో ప్రధాన పాత్రలను డిజైన్ చేసుకున్నాడు. కొసమెరుపేంటంటే.. ఈ దర్శకుడికి చిరంజీవి అంటే అభిమానం కావొచ్చు. అందుకే తన హీరోహీరోయిన్ కు చిరంజీవి, విజయశాంతి అని పేర్లు పెట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప, బలమైన కథలు చెప్పగలిగిన సత్తా ఉన్నవాడు అనిపిస్తుంది.

 

ఈ దర్శకులందరి ప్రయాణం సాగాలని.. తెలుగు సినిమాకు మరిన్ని మంచి కథలు అందించాలని.. ఈ యేడాది సత్తా చాటిన ఈ దర్శకులందరికీ అభినందలతో ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. 

Tags:    

Similar News