ఏ విషయంలో అయినా అతి ఎప్పుడూ ప్రమాదమే. అది మాటలైనా, ప్రమోషన్స్ అయినా. ఈ విషయంలోనే గట్టి షాక్ తిన్నాడు నితిన్. ఆ కారణంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. మొన్నటి వరకూ మాటల బరాటాలా కనిపించిన నితిన్.. ఈ సారి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోతా అంటున్నాడు. యస్.. నితిన్ లాస్ట్ మూవీ రాబిన్ హుడ్ కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి నానా హడావిడీ చేశారు. అనిల్ రావిపూడిని ఫాలో అవుతున్నాం అంటూ కావాల్సిన దానికన్నా కాస్త ఎక్కువే చేశారు. అయితే వీళ్లు ఏం చేసినా సినిమాను హైప్ చేయడమే కదా మెయిన్ ఎజెండా..? బట్ ఆ విషయంలో రాబిన్ హుడ్ లో విషయం లేదు. ఆ విషయం మొదటి ఆటకే తేల్చేశారు ఆడియన్స్. బాగోలేకపోవడం ఓ ఎత్తైతే.. అత్యంత దారుణంగా ఉంది అనే టాక్ తెచ్చుకోవడం మరో ఎత్తు. రాబిన్ హుడ్ ఈ రెండో టాక్ ను తెచ్చుకుంది. చూసిన వాళ్లంతా థియేటర్స్ లో హాహా కారాలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. అంత అవుట్ డేటెడ్ కంటెంట్ అది. అందుకే ఒకప్పుడు నైజాంగ్ లో స్ట్రాంగ్ గా ఉన్న నితిన్ మూవీస్ రాబిన్ హుడ్ తో డేంజర్ జోన్ లోకి అడుగుపెట్టాయి. ఎంతలా అంటే ఈ మూవీ మొత్తం కలెక్షన్స్ కూడా నైజాంలో 90లక్షలకే ఆగిపోయింది. అంటే కోటి కూడా రీచ్ కాలేదు. అదే పెద్దగా స్టార్స్ లేని కేవలం సమంత కోసం చూసిన శుభం ఏకంగా కోటి 30 లక్షల వరకూ నైజాంలో వసూలు చేసింది. అంటే నితిన్ రేంజ్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక జూలై 4న ఈ సారి ‘తమ్ముడు’అంటూ వస్తున్నాడు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. కాంతార ఫేమ్ సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక, ఫీమేల్ లీడ్స్ లో కనిపిస్తున్నారు. లయ రీ ఎంట్రీ ఇస్తోందీ మూవీతో. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు బ్యాంగర్ కు మంచి స్పందనే వచ్చింది. కొంత ప్రామిసింగ్ గా కనిపిస్తోంది కూడా. అయితే ఈ సారి తమ్ముడు కోసం నితిన్ ఎలాంటి హడావిడీ చేయొద్దు అని డిసైడ్ అయ్యాడు. అస్సలు మాట్లాడొద్దు అని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్వ్యూస్ లాంటివేం పెట్టుకోవడం లేదట. కేవలం ఈవెంట్స్ కు మాత్రమే అటెండ్ అవుతా అని.. అవి ఎన్నైనా పెట్టుకోండి అని తేల్చి చెప్పాడట. అంటే రాబిన్ హుడ్ టైమ్ లో తను మాట్లాడిన మాటలకు సినిమా రిజల్ట్ కు మధ్య చాలా దూరం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెబుతున్నారు. మరి అసలే మాట్లాడకపోయినా అసలుకే ప్రమాదం వచ్చే అవకాశమూ లేకపోలేదు. అందుకే కాస్త ఆచితూచి మాట్లాడితే నష్టం లేదు. రాబిన్ హుడ్ విషయంలో అది ఫాలో అవక అభాసు పాలయ్యాడు నితిన్. అందుకే ఈ షాకింగ్ డెసిషన్ అంటున్నారు.