సినిమా బావుంటేనే జనం చూస్తారు. లేదంటే లేదు. ఇది స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకూ వర్తిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ కొందరు జర్నలిస్ట్ లకు మాత్రం ఆ విషయం తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఏ సినిమా అయినా కంటెంట్ ను బట్టే కలెక్షన్స్ వస్తాయి. ఫ్లూక్ లో ఏ సినిమాలు ఆడవు. లేదంటే ఒకేసారి రెండు మూడు సినిమాలు విడుదలైతే.. ఒకటి బాలేదు కదా అని మరోటి హిట్ అయిపోదు. ఇది బాలేకపోతే ఇదీ పోతుంది. అసలు సినిమాలు బాగాలేవు అని తెలిస్తే ఆడియన్స్ ఆ వైపే చూడరు. ఏదో చాలా పెద్ద హీరోల సినిమాలు మినహాయించి.. చిన్న, మీడియం రేంజ్ మూవీస్ అయితే టాక్ ను బట్టే టికెట్స్ తెగుతున్నాయి. దశాబ్దానికి పైగా ఇదే నిరూపితం అవుతోంది. మార్చి నెలలో దాదాపు 30కి పైగా సినిమాలు విడుదలైతే కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. టాక్ మాత్రమే కాదు.. అద్భుతమైన కలెక్షన్స్ సైతం సాధిస్తున్నాయి. అయితే ఈ కలెక్షన్స్ లో నిజం లేదు అంటే కొన్ని వెబ్ సైట్స్ అదే పనిగా రాస్తూ తాజాగా విడుదలైన మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ అన్నీ ఫేక్ అంటూ విశ్లేషణలు చేస్తుండటం పై ఆ చిత్ర నిర్మాత నాగవంశీ ఫైర్ అయిపోయాడు.
‘ఒక సినిమా విడుదలైన తర్వాత బావుందా లేదా అంటూ రివ్యూస్ రాసే హక్కు మీకు ఉంది. కానీ కలెక్షన్స్ వస్తున్నప్పుడు పక్క సినిమా బాలేదు కాబట్టే ఈ చిత్రానికి వస్తున్నాయి. ఇవన్నీ గాలివాటం వసూళ్లు. ఇందులో నిజం లేదు. అన్నీ అబద్ధాలే’ అంటూ అదే పనిగా రాస్తూ ఉండటం నిర్మాతకు చిర్రెత్తుకు వచ్చేలా చేసింది. మరో వెబ్ సైట్ లోనేమో ‘ఏదో సీక్వెల్ కాబట్టి ఆడుతోంది. అయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోంది అనడానికి మాదేం బాహుబలి, కేజీఎఫ్, పుష్ప 2 కాదు కదా ఎలా ఉన్నా చూడ్డానికి.. అఫ్ కోర్స్ ఆ సినిమాలు బావున్నాయి. ఇందులో కాంట్రవర్శీలు వెదక్కండి. పోనీ వీళ్లేమైనా పెద్ద హీరోలు కాదు కదా. కోర్ట్ విషయంలో కూడా అదే చెప్పారు. పక్క సినిమా బాలేదు కాబట్టి అది ఆడింది. కానీ కోర్ట్ బావుంది కాబట్టే జనం చూశారు’అన్నాడు. ‘మేం ఉంటేనే మీరు ఉంటారు. మేం లేకపోతే మీరూ మీ వెబ్ సైట్స్, యూ ట్యూబ్ ఛానల్స్ మూసుకుని ఉండాల్సిందే. రివ్యూ వరకూ ఓకే. కానీ కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని చెప్పే మీకు ఎవరిచ్చారు. పోనీ మీ వద్ద ఆధారాలున్నాయా.. ఇదుగో నా సినిమా కలెక్షన్స్ ను చూపించే దమ్ము నా దగ్గర ఉంది. మీకు ఇవి తప్పు అని నిరూపించే దమ్ము ఉందా.. ఉంటే రండి..’అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఏదేమైనా కంటెంట్ ఉంటేనే సినిమాలకు కలెక్షన్స్ వస్తాయి. ప్రధానంగా చిన్న సినిమాలకు. మామూలుగా చిన్న సినిమాలు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. వాళ్లే నానా తంటాలు పడుతూ ఇన్నోవేటివ్ ప్రమోషన్స్ తో కాస్త పేరున్న నిర్మాణ సంస్థల సాయంతో తమ చిత్రాన్ని ప్రేక్షకులు వరకు మాత్రమే తీసుకురాగలరు. ఒక్కసారి రిలీజ్ అయిందా.. అంతే. అంతా ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. టాక్ ను బట్టి టికెట్స్ బుక్ అవుతాయి. ఆ టాక్ బలంగా ఉంటే బలమైన కలెక్షన్స్ కూడా వస్తాయి. మార్చిలో విడుదలైన కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలకు భారీ కలెక్షన్స్ వస్తుండటానికి కారణం అదే. ఆ విషయాన్నే కాస్త గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు నాగవంశీ. అయితే నాగవంశీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఓ రెండు మూడు వెబ్ సైట్స్ మాత్రమే భుజాలు తడుముకుంటుండటం విశేషం.