Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ మరణం తరువాత కర్ణాటకలో కొత్త మార్పులు..

Puneeth Rajkumar: ఒకప్పుడు వయసు పైబడిన వారికే గుండెపోటు లాంటి సమస్య వచ్చేది.

Update: 2021-11-05 15:27 GMT

Puneeth Rajkumar (tv5news.in)

Puneeth Rajkumar: ఒకప్పుడు వయసు పైబడిన వారికే గుండెపోటు లాంటి సమస్య వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. టీనేజ్ నుండి వృద్ధుల వరకు ఎవరికైనా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. పైకి బాగున్నాం కదా అని మన ఆరోగ్యం కూడా బాగుంది అనుకుంటే పొరపాటే అనిపిస్తోంది. దీనికి ఉదాహరణే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం.

అప్పటివరకు అప్పు అందరితో సరదాగానే ఉన్నారు. కాస్త అలసటగా అనిపిస్తే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. కానీ ఇంత దారుణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. పునీత్‌కు పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. ఎప్పుడు జిమ్ చేస్తూ, ఫిట్‌గా ఉండడానికే ప్రయత్నించేవారు. అలాంటి ఆయనకే అలా జరిగిందంటే.. ఈ హార్ట్ ఎటాక్ సమస్య ఇంకా ఎంతమందిని పీడిస్తుందో అని కర్ణాటక రాష్ట్రంలో వింత పరిణామం చోటుచేసుకుంటోంది.

పునీత్ మరణం తర్వాత ఎవరిలో ఏ ఆరోగ్య సమస్య ఉందో అని అనుమానంతో కర్ణాటక రాష్ట్రంలోని ప్రజలంతా హాస్పిటల్స్‌కు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా బెంగుళూరులో భయంతో హాస్పిటల్‌కు వెళ్తున్న వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. అయినా అంతమంది ఒకేసారి హాస్పిటల్‌కు ఎందుకు అనుకుంటున్నారా..? గుండె సంబంధిత వ్యాధుల గురించి పరీక్షలు చేయించుకోవడానికి.

ఇదే విషయాన్ని బెంగుళూరులోని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు కూడా చెప్తున్నారు. మునుపటితో పోలిస్తే హాస్పిటల్స్‌కు గుండె సంబంధిత వ్యాధుల గురించి పరీక్షలు కోసం వస్తున్నవారి సంఖ్య 30-35శాతం పెరిగినట్లు వెల్లడించారు. అంటే రోజుకు సుమారు 1200 మంది ఈ టెస్టులు చేయించుకుంటున్నారు. నవంబర్ 1న హాలిడే సందర్భంగా 1700 మంది ప్రజలు హాస్పిటల్స్‌లో ఈ పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కర్ణాటకలో ఐ డొనేషన్‌లు కూడా ఉన్నపళంగా పెరిగిపోయాయి. పునీత్ రాజ్‌కుమార్ మరణం తర్వాత కూడా తన కళ్లను దానం చేయడం వల్ల మరో నలుగురికి కంటిచూపును ఇచ్చారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానులు కూడా కళ్లను దానం చేయడం మొదలుపెట్టారు. దీని వల్ల చాలామంది చూపులేని వారు ప్రపంచాన్ని చూడడానికి అవకాశం ఉన్నట్టే..

Tags:    

Similar News