Rag Mayur : టాలెంట్ ఉంది.. ఆఫర్స్ వస్తే రైజ్ అవుతాడు

Update: 2025-04-04 05:20 GMT

కొంతమంది కుర్రాళ్లను వెండితెరపై చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత నేచురల్ గా నటిస్తున్నారు.. వీరికి బ్రేక్ రాదేంటీ అనిపిస్తుంది. బ్రేక్ సంగతి పక్కన పెడితే సరైన అవకాశాలు కూడా రావు ఒక్కోసారి. అయినా వస్తోన్న ప్రతి అవకాశాన్ని అద్భుతంగా అందిపుచ్చుకుంటూ తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న కుర్రాడు రాగ్ మయూర్. ఇలా పేరు చెబితే అతను గుర్తు రాడు. ఈ మధ్యే వచ్చిన సివరాపల్లి అనే వెబ్ సిరీస్ లో పంచాయితీ కార్యదర్శి అంటే ఠక్కున గుర్తు పట్టేస్తాం. అదీ అతని టాలెంట్. మనిషికంటే ప్రతిభకే గుర్తింపు ఎక్కువ. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు, గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.

షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ మొదలుపెట్టాడు రాగ్ మయూర్. మెంటల్ మదిలో సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలో కనిపించాడు. ఆ సినిమా వచ్చిన నాలుగేళ్లకు సినిమా బండి అనే మూవీలో మరిడేష్ బాబు అనే పాత్రలో అదరగొట్టాడు. అయినా సరైన అవకాశాలు రాలేదు. 2023లో తరుణ్ భాస్కర్ రూపొందించిన కీడా కోలాలో కౌశిక్ పాత్రలో మరోసారి సహజ నటనతో మెప్పించాడు. ఇదీ కొత్త ఆఫర్స్ పెద్దగా తేలేదు. ప్రధాన పాత్రలకు సపోర్టింగ్ గా శ్రీరంగ నీతులు, వీరాంజయనేయులు విహారయాత్ర, గాంధీతాత చెట్టు వంటి మూవీస్ తో ఆకట్టుకుంటున్నాడు. బట్ సివరాపల్లి సిరీస్ అతని టాలెంట్ ను అందరికీ చూపించింది. రీమేక్ అయినా ఈ సిరీస్ లో శ్యామ్ ప్రసాద్ గా అద్బుతంగా నటించాడు. సహజమైన తెలంగాణ స్లాంగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటోన్న అతను మరీ హీరోగా కాకపోయినా ఇంపాక్ట్ పాత్రల్లో రాణించగల సత్తా ఉన్నవాడు. మరిన్ని అవకాశాలు వస్తే మరింతగా షైన్ అవుతాడేమో చూడాలి.

Tags:    

Similar News