Ram Gopal Varma : మనోజ్ బాజ్ పేయితో ఆర్జీవీ దెయ్యం సినిమా

Update: 2025-09-01 07:56 GMT

కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ అనిపించుకుంటాయి. కాకపోతే అవి వన్ టైమ్ వండర్స్ లా మిగిలిపోతాయి. 1998లో రామ్ గోపాల్ వర్మ పీక్స్ లో ఉన్న టైమ్ లో వచ్చిన సత్య మూవీ బాలీవుడ్ ను షేక్ చేసింది. అప్పటి వరకూ హిందీ సినిమా ఇలాంటి కంటెంట్ ను చూడలేదు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత వాస్తవికంగా వర్మ తెరకెక్కించిన సత్య బాలీవుడ్ మైండ్ సెట్ నే మార్చేసింది. ఆ సినిమాతోనే భికూ మాత్రేగా మనోజ్ బాజ్ పేయి అనే మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ను కూడా పరిచయం చేసింది. మనోజ్ అంతకు ముందే ఆరు సినిమాల్లో నటించాడు. కానీ అలాంటి ఓ నటుడు ఉన్నాడు అని బాలీవుడ్ గుర్తించలేదు. సత్యతో అతను ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అందుకే వర్మను తన గాడ్ ఫాదర్ అని చెబుతాడు మనోజ్ బాజ్ పేయి. ఆ తర్వాతి యేడాది సుమంత్ ను హీరోగా పరిచయం చేస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రేమకథలో నటించాడు. ఆపై మళ్లీ వర్మ డైరెక్షన్ లో సినిమా చేయలేదు మనోజ్ బాజ్ పేయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబోలో ఓ మూవీ రాబోతోంది.

ఈ సారి వర్మ అండ్ మనోజ్ కలిసి ఓ హారర్ మూవీతో రాబోతున్నారు. యస్.. ఇండియన్ సినిమాకు వర్మ హారర్ జానర్ లోనూ ఓ కొత్త కంటెంట్ ను పరిచయం చేశాడు. తర్వాత అతని రూట్ లో చాలామంది వెళ్లారు. హారర్ అనేది ఎప్పుడైనా వర్కవుట్ అయ్యే కంటెంట్. కాకపోతే కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పేరు ‘పోలీస్ స్టేషన్ మే భూత్’. పోలీస్ స్టేషన్ లో దెయ్యం అనుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. మనోజ్ బాజ్ పేయి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. అతనికి జోడీగా జెనీలియా నటించబోతోంది. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ మూవీ.

మొత్తంగా ఆర్జీవీ కొన్నాళ్లుగా ఫామ్ లో లేడు. అయినా తన గాడ్ ఫాదర్ అనే కృతజ్ఞతతో ఈ మూవీ చేస్తున్నట్టున్నాడు మనోజ్. ఎందుకంటే మనోజ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. చేసిందల్లా హిట్ అన్నట్టుగా ఉన్నాడు. మరి ఈ రేర్ కాంబోలో చాలా కాలం తర్వాత వస్తోన్న ఈ భూత్ మూవీ వర్మను మళ్లీ మునుపటి ఫామ్ లోకి తెస్తుందా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News