రమణ గోగుల.. ఈ శతాబ్ది ఆరంభంలో తెలుగు సినిమా సంచలనం. అప్పటి వరకూ ఉన్న మ్యూజిక్ కు భిన్నంగా.. తనకే సొంతమైన ఓ పెక్యులర్ వాయిస్ తో అద్భుతమైన పాటలు పాడటం, కంపోజ్ చేయడం ద్వారా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. 1998లో వెంకటేష్, ప్రీతి జింటా జంటగా వచ్చిన ప్రేమంటే ఇదేరా చిత్రంతో సంగీత దర్శకుడుగా ప్రయాణం మొదలుపెట్టాడు రమణ గోగుల. ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అతనిలోని కొత్తదనం పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చింది. వెంటనే తమ్ముడు, బద్రి, జానీ, అన్నవరం చిత్రాలకు అతన్నే సంగీత దర్శకుడుగా తీసుకున్నాడు. రమణ గోగుల, పవన్ కళ్యాణ్ కాంబో సూపర్ హిట్ అయింది. నిజంగా పవన్ కళ్యాణే పాడుతున్నాడా అన్నట్టుగా సరిపోయిన ఏకైక గాత్రం రమణది. చిన్నోడు, లక్ష్మి, ప్రభాస్ యోగి, వియ్యాల వారి కయ్యాలు, బోణీ వంటి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అతని ఖాతాలో ఉన్నాయి. చివరగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో సూపర్ హిట్ ఇచ్చాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన 1000 అబద్ధాలు అనే మూవీ తర్వాత ఆయన ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చాడు. అందుకు కారణం సుమంత్ హీరోగా అతను ‘బోణీ’అనే చిత్రాన్ని నిర్మించడమే. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అప్పులు పెరిగాయి. ఆఫర్స్ తగ్గాయి. కొన్నాళ్ల క్రితం ఓ కార్పోరేట్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రమణ గోగుల గాత్రం వినబోతున్నాం. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’అనే చిత్రంలో ఓ పాటను రమణతో పాడిస్తున్నాం అని ఇంతకు ముందే చెప్పారు. నిజంగా ఆ పాట ఆయన గాత్రంలో అదిరిపోయిందని తాజాగా వచ్చిన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.
‘గోదారి గట్టు మీదా రామసిలకవే.. గోరింటాకెట్టుకున్న సందామామవే’ అంటూ భాస్కరభట్ల రాసిన ఈ గీతాన్ని తనదైన శైలిలో హుషారుగా ఆలపించాడు రమణ గోగుల. అతనితో పాటు ఫీమేల్ వాయిస్ ను మధు ప్రియ అందించింది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
మొత్తంగా ఈ పాట తర్వాత మళ్లీ రమణ గోగుల గాత్రానికి డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలకూ పాడే ఛాన్స్ ఉంది. మరి సింగర్ గా వచ్చే అవకాశాలను వాడుకుంటాడా లేక మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారతాడా అనేది చెప్పలేం కానీ.. దాదాపు దశాబ్దం తర్వాత చాలామందికి ఫేవరెట్ అయిన రమణ గోగుల గాత్రాన్ని మళ్లీ వినబోతున్నాం.