తెలంగాణ అసెంబ్లీ టాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. అయితే మేటర్ అల్లు అర్జున్ ను దాటుకుని ఏకంగా ఇండస్ట్రీ పైనే పడింది. ఇకపై తను ముఖ్యమంత్రిగా ఉండగా బెన్ ఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచడాలూ ఉండవని ప్రకటించాడు రేవంత్ రెడ్డి. దీనిపై ఎలా స్పందించాలో కూడా టాలీవుడ్ కు అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రిని తప్పు అనడానికి లేదు. ఎందుకంటే ఈ రెండు అంశాలూ ప్రజలకు ఉపయోగపడేవి కావు. పైగా ప్రజల జేబులు చిల్లులు చేసేవే. అందుకే టాలీవుడ్ స్పందిస్తే జనాల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. లేదూ అంటే సినిమాలకు నష్టం వస్తుంది. రికార్డుల గురించి మాట్లాడేందుకు స్పేస్ తగ్గుతుంది. అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నారు టాలీవుడ్ జనం.
అయితే రేవంత్ రెడ్డి ప్రకటన వల్ల మొదట నష్టపోయే సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పాలి. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. తాజాగానే ఆయన్ని ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఈ నిర్ణయంలో ముఖ్యమంత్రి కీలకం. కాబట్టి ఇప్పుడు తన పదవిని దాటి దిల్ రాజు కూడా మాట్లాడలేడు. ఏదైనా లోపాయికారీ ఒప్పందాలు జరిగితే జనానికి తెలుస్తుంది. అప్పుడు పరిశ్రమతో పాటు ప్రభుత్వంపైనా విమర్శలు వస్తాయి. దీంతో గేమ్ ఛేంజర్ కు ఓపెనింగ్ డే రికార్డ్స్ అనే మాటే ఉండదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి నైజాం ఏరియా స్ట్రాంగ్ మార్కెట్ తో ఉంటుంది. అది కోల్పోతే గేమ్ ఛేంజర్ కు భారీ లాస్ ఉంటుంది.
సో.. సిఎమ్ నిర్ణయంతో ఫస్ట్ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ కే. మరి కనీసం ఎక్స్ ట్రా షోస్ కైనా అనుమతి ఉంటుందా లేదా అనేది చూడాలి.