నేచురల్ బ్యూటీ అండ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ఒక సినిమా చేస్తుందంటే ఖచ్చితంగా బలమైన కథనే ఎక్స్ పెక్ట్ చేస్తాం. అంతకు మించి తన నటన కనిపిస్తుందని కూడా అనుకుంటాం. అందుకే తన సినిమాలకే కాదు.. తనకూ పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన తండేల్ అనే మూవీ చేస్తోంది. బాలీవుడ్ లో రామాయణంలో సీత పాత్ర చేస్తోంది. తమిళ్ లో శివకార్తికేయన్ సరసన అమరన్ అనే మూవీలో నటించింది. చాలామంది ఈ మూవీ రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనుకున్నారు. కానీ బయోపిక్ లాంటి మూవీ అని లేటెస్ట్ గా తెలిసింది. అది కూడా సాయి పల్లవి పాత్రను పరిచయం చేసిన తర్వాతే. ఈ మూవీలో సాయి పల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్ఘిస్ పాత్రలో కనిపించబోతోంది. మేజర్ ముకుంద్ 2014లో సౌత్ కశ్మీర్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ లో లోకల్ విలేజర్స్ ను కాపాడి తను మరణించాడు. ఆయన మరణానంతరం అశోక చక్ర బిరుదును ప్రదానం చేశారు. ఈ బిరుదును అతని భార్య ఇందు అందుకుంది. ఆ పాత్రలోనే సాయి పల్లవి కనిపించబోతోంది.
శివకార్తికేయన్ మేజర్ పాత్రలో కనిపించబోతోన్న ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేశాడు. కమల్ హాసన్ నిర్మించాడు. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఈ మూవీ విడుదల కాబోతోంది. మొత్తంగా సాయి పల్లవి క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో అద్భుతంగా ఉంది. మేజర్ గా ఎదిగే వరకూ అతనికి సంబంధించి ఆమె చెప్పిన మూడు ముక్కలు దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. భర్త చనిపోయిన తర్వాత తను అతనితో లాంగెస్ట్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ లో ఉన్నానని ఇందు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఆ డైలాగ్స్ ను సాయి పల్లవి వీడియోలో కూడా ఉన్నాయి.