నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాడు. ఈ యాత్ర షాద్ నగర్ నుంచి తిరుపతి వరకూ ఉండబోతోంది. అయితే పాదయాత్ర అనగానే పొలిటికల్ గానే చాలామంది భావిస్తుంటారు. బట్ అందుకు భిన్నంగా ఉండబోతోంది ఈ యాత్ర. ఆ యాత్ర వెనక ఉద్దేశ్యం బావుంది. యాత్ర చేయబోతోన్న బండ్ల గణేష్ నిర్ణయం చాలా పెద్దది కూడా. మరి ఇంత చెప్పిన తర్వాత బండ్ల గణేష్ భారీ స్థాయిలో పాదయాత్ర ఎందుకు చేయబోతున్నాడు అంటే.. సింపుల్.
గతంలో స్కిల్ డెవలప్ మెంట్ కేస్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఈ కేస్ లో అప్పటి జగన్ ప్రభుత్వ తీరు దారుణంగా ఉంది. నాటి ప్రజాస్వామ్యానికి ఓ మాయ మచ్చలా అతని అరెస్ట్ కనిపించింది. తర్వాత కోర్ట్ కొట్టివేసింది. తర్వాత చంద్రబాబు మళ్లీ ప్రభుత్వంలోకి రావడానికి ఓ ప్రధాన కారణం కూడా ఆయన అరెస్టే.
గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలాంటి మచ్చ లేకుండా విడుదల అవ్వాలని శ్రీవారికి మొక్కుకున్నాడు నిర్మాత బండ్ల గణేష్. ఇంత చంద్రబాబుపై ఎంత ప్రేమ ఉంటే ఆయన అలాంటి మొక్కుకున్నాడు. ఫైనల్ గా చంద్రబాబు కోర్ట్ కేస్ కొట్టేసింది. తన కోరిక తీరింది కాబట్టి ఇప్పుడు బండ్ల గణేష్ మొక్కు తీర్చుకోబోతున్నాడు. అందుకే ఈ పాదయాత్ర. ఈ నెల 19 నుంచి షాద్ నగర్ లోని తన స్వగృహం నుంచి పాదయాత్ర ప్రారంభం కాబోతోంది. అక్కడి నుంచి ఆయన కాలి నడకన తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకునేంత వరకూ ఆయన మొక్కు తీర్చుకునే కార్యక్రమం సాగుతుంది. అయితే భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించాలని బండ్ల గణేష్ నిర్ణయించుకున్నాడు.