Sathi Leelavathi : భర్తను హింసిస్తున్న లావణ్య త్రిపాఠి

Update: 2025-07-29 08:15 GMT

అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకుల చేత అనిపించుకున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ మధ్య వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. త్వరలోనే తల్లి కూడా కాబోతోంది. దీంతో తన సినిమా ప్రయాణం ముగిసిపోయినట్టే అనుకున్నారు. కానీ మెగా ఇమేజ్ కు ఇబ్బంది లేకుండా తను సినిమాలు చేసుకోవడానికి అనుమతి వచ్చింది. అందుకే పెళ్లి తర్వాతే తను ‘సతీ లీలావతి’అనే సినిమా చేసింది. దేవ్ మోహన్ హీరోగా నటించాడు. సత్య తాతినేని దర్శకత్వం చేసిన ఈ మూవీ టీజర్ విడుదలైంది. టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఇదే టైటిల్ తో కమల్ హాసన్ చేసిన మూవీ గొప్ప కామెడీని పంచింది. వీళ్లు కూడా అదే ఫార్మాట్ లో కామెడీనే పంచబోతున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

మామూలుగా ఈ టైటిల్ చూస్తే అణకువగా ఉండే భార్యను ఊహించుకుంటారు. బట్ అందుకు భిన్నంగా ఈ లీల భర్తను చితక బాదుతోంది. ఊ అంటే చాలు కట్టేసి మరీ కొట్టేస్తోంది. పెళ్లయిన తర్వాత కొన్నాళ్లకు మనం విడిపోదాం అంటాడు భర్త. కట్ చేస్తే కట్టేసి నోరు కుట్టేసింది లీల. ఆ స్థితిలోనే అతను ‘ఐదు రూపాయలే కదా అని పెన్నును చీప్ గా చూడకు లీలా.. దాంతోనే ఐదు కోట్ల చెక్ మీద సంతకం పెడతా..’ అని పంచ్ డైలాగ్ కొడతాడు.. దానికి ‘ఏదైనా ఆయిలే కదా అని బెంజ్ కారులో కోకోనట్ ఆయిల్ పోసుకోకూడదు.. కౌంటర్స్ నాకు కూడా వచ్చు.. ’అని తిరిగి పంచ్ డైలాగ్ కొడుతుంది. అతన్ని చూస్తేనేమో బయట సూపర్ మేన్ లా కనిపిస్తున్నాడు. కానీ ఇంట్లో మాత్రం పెళ్లాం చేత తన్నులు తింటున్నాడు. మరి మొగుడుపెళ్లాల.. సారీ ఈ సతీ లీలావతి కోటింగ్ ఏ తీరానికి చేరింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ఇక ఇతర పాత్రల్లో సప్తగిరి, నరేష్, విటివి గణేష్, మొట్ట రాజేంద్రన్, జఫార్ సాదిఖ్ లు కనిపిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. 

Full View

Tags:    

Similar News