నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్ట్ చేసిన తండేల్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ జంటకు ఉన్న క్రేజ్ తో పాటు అది వాస్తవ కథ ఆధారంగా రూపొందిన సినిమా కావడంతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగేలా ఉండటంతో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ తండేల్ కథతోనే మరో సినిమా వస్తోంది. అది కూడా ఓటిటిలో. శ్రీకాకుళానికి చెందిన కొందరు జాలర్లు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి పొరబాటున పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తారు. వీరు గూఢాచారులేమో అనుకుని పాకిస్తాన్ నేవీ పోలీస్ లు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరి వారిని భారత్ ఎలా విడిపించింది అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీ టైటిల్ ‘అరేబియా కడలి’.
అరేబియా కడలిని అమెజాన్ ప్రైమ్ విడుదల చేయబోతోంది. అంటే పూర్తిగా ఓటిటి మూవీగానే ఉండబోతోంది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ తండేల్ కథతో మరో సినిమానా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి వీరు శ్రీకాకుళం జాలరుల పర్మిషన్ తీసుకున్నారో లేదో కానీ.. ఊర్ల పేర్లు మాత్రం మార్చినట్టు కనిపిస్తోంది. తండేల్ లో సాయి పల్లవి పాత్రలో ఈ చిత్రంలో ఆనంది కనిపిస్తోంది. కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్, నాజర్, రఘుబాబు, పూనమ్ బజ్వా ఇతర కీలక పాత్రల్లో కనిపింబోతున్నారు. వై రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని వివి సూర్య కుమార్ డైరెక్ట్ చేశాడు. మరి తండేల్ మూవీలా ఈ చిత్రానికి కూడా అదే స్థాయిలో అప్లాజ్ వస్తుందా లేదా అనేది చూడాలి.