తమిళ సినిమా పరిశ్రమలో విషాదం నెలకొంది. సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడుగా, నటుడుగా మారి ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకున్న వేలు ప్రభాకరన్ (68) కన్నుమూశాడు. 1980లో ఇవర్గళ్ విత్యాసమనవర్గల్ అనే చిత్రంతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయ్యాడు వేలు ప్రభాకరన్. ఆ తర్వాత నాలయ మనితన్ చిత్రంతో దర్శకుడుగా మారాడు. దాదాపు తన చిత్రాలకు ఎక్కువ శాతం తనే సినిమాటోగ్రఫీ అందించుకున్నారు. నెపోలియన్, రాంకీ, అరుణ్ పాండియన్ వంటి తమిళ్ యాక్షన్ హీరోస్ తో ఎక్కువ మూవీస్ చేశాడు. అలాగే ఆయన సినిమాలకు ఆర్కే సెల్వమణి కథ, స్క్రీన్ ప్లే అందించే వారు. ఆ కారణంతో రోజా వేలు ప్రభాకరన్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించేది.
పెరియార్ భావజాలం ఉన్న ప్రభాకరన్ సినిమాల్లోనూ అతి ప్రతిబింబించేది. వివక్ష, అణచివేతలపై సినిమాలు చేశారు. యాక్షన్ మూవీస్ తోనూ మెప్పించాడు. కాదల్ కధై అనే చిత్రం తమిళనాడులో సంచలనం సృష్టించింది. దాదాపు బి గ్రేడ్ మూవీ లా చూపించినా అందులోనూ సందేశమే అందించారు. ఇలాంటి సినిమాలతో అప్పుడప్పుడూ తీవ్రమైన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కాదల్ కధై చిత్రంలోనే నటించిన నటిని రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు ప్రభాకరన్. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకరన్ ఈ (శుక్రవారం) ఉదయం చెన్నైలో కన్నుమూశాడు.