Sirivennela Seetarama Sastry: సాహిత్యవనంలో సేద్యం చేసిన 'సీతారాముడు'

Sirivennela Seetarama Sastry: తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన కుసుమం సీతారామ శాస్త్రి.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు..

Update: 2021-11-30 11:30 GMT

Sirivennela Seetarama Sastry: తెలుగు సినిమా పాటల పూదోటలో విరిసిన కుసుమం సీతారామ శాస్త్రి.. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రికి వేల వేల వందనాలు.. సినిమా ఉన్నంత వరకు సీతారామ శాస్రి పాట బ్రతికే ఉంటుంది.. ఎవరన్నారు ఆయన లేరని.. మనిషి లేకపోతేనేం.. మనసును హత్తుకునే పాటలెన్నో రాశాడు.. మనిషిని కదిలించే పాటలెన్నో రాశారు. అక్షరాలనే ఆయుధాలుగా మార్చేసి, పాటలో పదాలను నిక్షిప్తం చేసి సమాజాన్ని నిగ్గదీసి అడిగారు.. అనితర సాధ్యమైన సాహిత్యం ఆయన పాటలో ప్రవహిస్తుంది. తెలుగు సినిమా యవనికపై సాహితీ వెన్నెల కురిపించిన సినీకవి సీతారామశాస్త్రి.

విరహ గీతం.. శాస్త్రీయ గీతం.. సందేశాత్మక గీతం.. ఏదైనా ఆయన కలం నుంచి ఆశువుగా జాలువారుతుంది. 1955 మే 20న విశాఖపట్నం అనకాపల్లిలో జన్మించారు సీతారామశాస్త్రి. టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో సాధారణ ఉద్యోగిగా ఉంటే కాలక్షేపానికి పద్యాలు, గేయాలు రాసేవారు. ఒకసారి ఆయన రాసిన గంగావతరణం అనే గేయాన్ని చూసిన దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్ సీతారామశాస్త్రిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.

ఈ విధంగా విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన తొలిసినిమా సిరివెన్నెలలో అన్ని పాటలు రాసే అదృష్టం ఆయనకు దక్కింది. దాంతో ఆ సినిమా పేరే అతని ఇంటి పేరుగా మారి చెంబోలు సీతారామశాస్త్రి కాస్తా సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. విధాత తలపున ప్రభవించినది పాటకు ప్రేక్షకుల వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి.. ఆ సినిమాలోని ఏ పాట చూసిన ఎంత అర్థం దాగి ఉంటుంది.. సరస్వతీ దేవి ఆయన నాలుక మీద నాట్యమాడి ఉంటుంది.. అవి అక్షరాలుగా ఆయన కలం నుంచి జాలువారి ఉంటాయి.. అందుకే 'నంది' కూడా పరవశించి పోయి ఆయన ఇంటికి పరుగెట్టుకుంటూ వచ్చింది.

సమాజంలోని కుళ్లును ఆయన కలంతో కడిగిపారేశాడు.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. నిప్పుతోని కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని.. అని రాస్తూనే 'మారదు ఈ లోకం మారదు ఈ కాలం' అని తన నిస్సహాతను ప్రకటించాడు మరో పాటలో. అర్థశతాబ్ధపు అజ్ఞానాన్ని స్వరాజ్యమందామా.. దానికి స్వర్ణోత్సవాలు చేద్ధామా అని సిందూరం చిత్రంలో ఆయన రాసిన పాటకు మరో నంది అతడి సొంతమైంది. 

Tags:    

Similar News