నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న సినిమా 'ద ప్యారడైజ్'. ఈ మూవీ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ అందరిలోనూ ఓ ఆసక్తి ఉంది. లేటెస్ట్ గా ద ప్యారడైజ్ రా స్టేట్మెంట్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే నాని,శ్రీకాంత్ కలిసి ఓ అవుటాఫ్ ద బాక్స్ లాంటి కంటెంట్ ను అందించబోతున్నారని అర్థం అవుతుంది. ''చరిత్రలో అంతా పావురాలు, చిలకల గురించే చెప్పుకున్నారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి ఎవరూ రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా నుంచి నడిచే శవాల కథ.అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఒక జాతి కథ. ఒక ధగడ్ వచ్చి మొత్తం జాతిల జోష్ తెచ్చింది. థూ అనిపించుకు్న కాకులు తల్వార్లు పట్టినయ్. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన ఒక 'లం..కొడుకు' కథ.నా కొడుకు నాయకుడైన కథ..అంటూ వాయిస్ తో కథా నేపథ్యాన్ని పరిచయం చేశారు. దీన్ని బట్టి ఆ ప్రాంతం ఎంత కల్లోలంగా ఉండేదో, ఆ కల్లోలాన్ని యుద్ధానికి సిద్ధం చేయడానికి ఆ నాయకుడు ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చిందో సినిమా చూస్తే కానీ తెలియదు.
దసరా విషయంలో సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో కథ చెప్పాడు శ్రీకాంత్. బట్ ఈ సారి కంప్లీట్ గా ఓ ఫిక్షనల్ వరల్డ్ ను క్రియేట్ చేశాడని అర్థం అవుతుంది. ఆ వరల్డ్ చూడ్డానికి చాలా బావుంది. ప్రశాంత్ నీల్ లాగా శ్రీకాంత్ కూడా బ్లాక్ షేడ్ ను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. ఇక ఈ గ్లింప్స్ అంటే రా స్టేట్మెంట్ తో ఈ సారి వీళ్లు గ్యారెంటీగా ఓ దుమారం రేపబోతున్నారని క్లియర్ గా తెలుస్తోంది.
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అతను మనసుపెట్టి మరీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడని ఈ గ్లింప్సే చెబుతోంది. ఇక 2026 మార్చి 26 న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. నాని కాకుండా ఇతర పాత్రల్లో సోనాలి కులకర్ణి నటిస్తుందన్నది మాత్రమే ఇందులో ఉంది. మిగతా కాస్టింగ్ ఎవరు అనేది మరోసారి చెబుతారేమో చూడాలి.