ప్యాన్ ఇండియా డార్లింగ్ స్టార్ ప్రభాస్ మూవీస్ లైనప్ చూస్తే అతను మరో నాలుగైదేళ్ల వరకూ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు అని అందరికీ అర్థం అయింది. గ్లోబల్ స్టార్ అయినా ప్రభాస్ దూకుడు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. యేడాది గ్యాప్ లోనే సలార్, కల్కి సినిమాలతో వచ్చాడు. 2025 సమ్మర్ లో రాజా సాబ్ రాబోతోంది. దీంతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. అటు ఎప్పుడో కమిట్ అయిన సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ స్పిరిట్ ఈ డిసెంబర్ నుంచే సెట్స్ పైకి వెళుతుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. అలాగే లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నాడు అనే రూమర్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ దాటుకుని అఫీషియల్ గా కన్నడ నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ చేసిన అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ బ్యానర్ ప్రభాస్ తో ఓ డీల్ సెట్ చేసుకుంది. తమ బ్యానర్ లో వరుసగా మూడు సినిమాలు చేయాలి అనేదే ఆ డీల్. ఒకే బ్యానర్ లో వరుసగా సినిమాలు చేసిన హీరోలు చాలామందే ఉన్నారు. కానీ ఇలా ఓ బయటి భాష బ్యానర్ ప్రభాస్ తో డీల్ సెట్ చేసుకోవడంలో ఆశ్చర్యమేం లేదు కానీ.. ప్రభాస్ అలా లాక్ అయిపోవడం మాత్రం ఆశ్చర్యంగానే ఉందని చెప్పాలి.
డీల్ లో భాగంగా ఈ బ్యానర్ లో సలార్ 2 ముందు స్టార్ట్ అవుతుంది.ఆ తర్వాత మరో రెండు సినిమాలు ఉంటాయి. ఇవన్నీ 2026 నుంచి వరుసగా ఉంటాయట. అంటే 2030 వరకు హొంబలే ఫిల్మ్స్ లో ప్రభాస్ సినిమాలు ఉంటాయి. కేజీఎఫ్ 1,2, కాంతార తర్వాత హొంబలే బ్యానర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. మరి ఈ నిర్మాణ సంస్థలోనే ప్రశాంత్ నీల్ సలార్2 తో పాటు ప్రశాంత్ వర్మ, లోకేష్ కనకరాజ్ సినిమాలు కూడా ఉంటాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే నిజమైతే.. ఇండియా నుంచి సిసలైన గ్లోబల్ స్టార్ గా ప్రభాస్ అవతరిస్తాడు అనేది నిజం.