చిన్న సినిమా పెద్ద సినిమా అంటాం కానీ అదంతా స్టార్డమ్, కలెక్షన్స్ లోనే కనిపించే తేడా. అసలు విషయం అంటే కంటెంట్. కంటెంట్ ఉంటే కటౌట్స్ తో పనిలేకుండా కలెక్షన్స్ వస్తాయని రీసెంట్ గా కమిటీ కుర్రోళ్లు, ఆయ్ మూవీస్ ప్రూవ్ చేశాయి. అఫ్ కోర్స్ ఈ రెండు సినిమాలకు ముందు కూడా ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని నిరూపించాయి. అయితే ఈ మూవీస్ తో పాటుగా వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేశాయి. అంచనాలు ఉన్నా.. వాటిని అందుకోలేక బోల్తా పడ్డాయి. ఇక ఇప్పుడు మరోసారి చిన్న పెద్ద అనే టాక్ వినిపిస్తోంది.
5,6,7 ఈ మూడు తేదీల్లో వరుసగా మూడు సినిమాలు వస్తున్నాయి. ఈ గురువారం గోట్ విడుదలవుతోంది. తమిళ్ టాప్ స్టార్స్ లో ఒకడైన విజయ్ నటించిన ఈ మూవీ తెలుగులోనూ కాస్త గట్టిగానే విడుదల కాబోతోంది. మైత్రీ మూవీస వాళ్లు విడుదల చేస్తున్నారు కాబట్టి థియేటర్స్ పరంగా పెద్ద సంఖ్యలోనే ఉండే అవకాశం ఉంది. అయితే పేరుకు పెద్ద హీరోయే కానీ తెలుగులో అంత లేదు. దీనికి తోడు అస్సలే మాత్రం ప్రమోషన్స్ చేయలేదిక్కడ. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్నా.. ఇండియాలోనే బిగ్ మార్కెట్ అయిన తెలుగును పట్టించుకోకపోవడం ఖచ్చితంగా స్వయంకృతాపరాధం అనే చెప్పాలి.
ఇక 6న విడుదలవుతోన్న చిన్న సినిమా 35 - చిన్న కథ కాదు. నివేదా థామస్, ప్రియదర్శి, భాగ్యారాజా, విశ్వదేవ్, గౌతమి వంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ మోస్ట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. చిన్న సినిమాలా అనిపిస్తున్నా పెద్ద కంటెంట్ ఉంది అని అర్థం అవుతోంది. అందుకే వీళ్లు ధైర్యంగా వస్తున్నారు. వీరి ధైర్యానికి కారణం కూడా ఆ కంటెంటే అనేది ఇండస్ట్రీలోనూ వినిపిస్తోన్న మాట.
7న విడుదలవుతోన్న మూవీ జనక అయితే గనక. సుహాస్, సంగీర్తన విపిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కంటెంట్ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. పిల్లల విషయంలో ప్రెజెంట్ జెనరేషన్ ఆలోచన తీరును సున్నితమైన విమర్శనాత్మక కోణంలో చూపించబోతున్నట్టుగా ఉంది. సుహాస్ సినిమా అంటే ఏదో కొత్త పాయింట్ ఉటుంది అనే పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ జనక అయితే గనక కూడా అది మరోసారి ప్రూవ్ చేస్తుందంటున్నారు. మొత్తంగా దేవర 1 వరకూ భారీ సినిమాలేం లేవు. ఈ టైమ్ లో చిన్న సినిమాలు సత్తా చాటితే ఇండస్ట్రీ కి కూడా కొత్త వెలుగు వస్తుందని చెప్పొచ్చు. కమిటీ కుర్రోళ్లు, ఆయ్ లాగా ఈ మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసుకుంటాయేమో చూడాలి.