ఒకప్పుడు క్రిస్మస్ పండగ అంటే తెలుగు సినిమాల నుంచి పెద్దగా ఆసక్తి కనిపించేది కాదు. ఇది మన సీజన్ కాదు అన్నట్టుగా ఉండేవారు. బట్ ట్రెండ్ మారింది. సీజన్ ఏదైనా శెలవులు ఉంటే చాలు.. సినిమాలు వచ్చేస్తున్నాయిప్పుడు. అయితే ఈ సారి క్రిస్మస్ సందడి నాలుగు రోజులు ముందుగానే మొదలైంది. ఈ శుక్రవారం నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో మూడు డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం.
అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చలమల్లి ఈ 20న విడుదలవుతోంది. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగాదేవి దర్శకుడు. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నరేష్ కెరీర్ లో సీరియస్ క్యారెక్టర్స్ చేసిన ప్రతిసారీ మాగ్జిమం హిట్స్ అందుకున్నాడు. ఈ బచ్చలమల్లి కూడా బ్లాక్ బస్టర్ అనేలా ఉందంటున్నారు చూసిన వాళ్లంతా. ఇండస్ట్రీలోని చాలామంది దర్శకులతో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన కూడా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఇది తుని ప్రాంతంలో నిజంగా జరిగిన కథ అంటున్నాడు దర్శకుడు. దానికి తనదైన శైలిలో సినిమాటిక్ కోటింగ్స్ అద్ది నరేష్ తో ఆ పాత్ర చేయించాడు. రియలిస్టిక్ ఉంటుందంటున్నాడు.బచ్చలమల్లితో క్రిస్మస్ కింగ్ తనే అంటున్నాడు నరేష్ కాన్ఫిడెంట్ గా.
రెండేళ్ల క్రితం వచ్చిన విడుదల 1 చిత్రానికి కొనసాగింపుగా వస్తోన్న మూవీ విడుదల 2. విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్ కీలక పాత్రల్లో నటించారు. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకులు సైతం విపరీతంగా మెచ్చుకున్నారు. ఆ పార్ట్ లో విజయ్ సేతుపతి పాత్ర చివర్లో ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయిన పాత్ర నేపథ్యం ఈ పార్ట్ లో కనిపిస్తుంది. ట్రైలర్ కు గొప్ప ప్రశంసలు వచ్చాయి. తెలుగులో కూడా బాగా ప్రచారం చేశారు. ఇక్కడ వెట్రిమారన్ రాలేదు కానీ.. విజయ్ సేతుపతి, మంజు వారియర్ చేసిన ప్రమోషన్స్ మంచి ఓపెనింగ్స్ తెస్తాయంటున్నారు. ఎలా చూసినా విడుదల 2 సూపర్ హిట్ అనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.వారి నమ్మకం నిజం అవుతుందా లేదా అనేది 20న తెలుస్తుంది.
ఇప్పుడంటే ప్యాన్ ఇండియా అని హడావిడీ చేస్తున్నారు కానీ.. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఆ ట్రెండ్ మొదలుపెట్టింది దర్శకుడు, హీరో ఉపేంద్ర. ఆయన డైరెక్ట్ చేసిన ఏ, ఉపేంద్ర సినిమాలు అప్పట్లో అన్ని భాషలనూ ఊపేశాయి. ఉపేంద్ర డైరెక్ట్ చేసిన సినిమా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రెగ్యులర్ గా ఉండదు అనే స్టాంప్ ఎప్పుడో పడిపోయింది. కొన్నాళ్లుగా డైరెక్షన్ కు గ్యాప్ ఇచ్చిన ఉప్పీ ఇప్పుడు 'యూఐ' అనే చిత్రంతో వస్తున్నాడు. దీని అర్థం ఏంటీ అంటే.. ఎవరికి ఎలా అర్థం అయితే అదే అంటున్నాడు తనదైన శైలిలో. ట్రైలర్ ఆయన స్టైల్లోనే వెరైటీగా ఉంది. ఆయన సినిమాల రిజల్ట్స్ ను గెస్ చేయడం కష్టం అంటారు. మరి ఈ చిత్రానికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
వీటితో పాటు మహేష్ బాబు వాయిస్ అందించిన ముఫాసా కూడా విడుదల కాబోతోంది ఈ 20నే. మామూలుగా ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి తెలుగులో మహేష్ బాబు వాయిస్ అంటే ఇంక చెప్పాలా.. అందుకే ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. కానీ అందుకు తగ్గ ప్రమోషన్స్ అయితే పెద్దగా కనిపించడం లేదు. ఆల్రెడీ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ముఫాసా కూడా అదే స్థాయి విజయం అందుకుంటుంది అనుకుంటున్నారేమో అనుకోవాలి. ఈ నాలుగు సినిమాలు.. క్రిస్మస్ కంటే ముందే పండగ వైబ్ ను తీసుకు రాబోతున్నాయి. మరి ఈ నాలుగు సినిమాల్లో టాప్ ప్లేస్ ఎవరికి దక్కుతుందో కానీ.. ఈ నాలుగూ డిఫరెంట్ జానర్స్ లో వస్తోన్న చిత్రాలు కావడం విశేషం.