చెట్లు ఎన్నో సినిమాల్లో ఉంటాయి. కొన్ని సినిమాల చెట్ల కింద ప్లీడర్లు కూడా ఉంటారు. ఎన్నో సినిమాలు చిత్రీకరించుకున్న ఒకే ఒక్క చెట్టు గురించి మీకు తెలుసా. ఆ చెట్టుకు ఏకంగా ‘ సినిమా చెట్టు ’ అనే పేరే పెట్టారని తెలుసా. యస్.. ఈ సినిమా చెట్టు చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.
గౌతమి, గోదావరి నదుల ఒడ్డున పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరు మండలంలోని కుమారదేవం అనే గ్రామంలో ఉండే ఈ నిద్ర గన్నేరు చెట్టు కింద ఎన్నో సినిమాల షూటింగ్స్ జరిగాయి. గోదావరి ఒడ్డున ఉండటం.. చాలా పెద్ద వృక్షం కావడంతో లొకేషన్ మరింత అందంగా ఉండేది.
ఈ నిద్రగన్నేరు చెట్టును సింగలూరి తాతబ్బాయి అనే ఆయ నాటారట. ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారిక్కడి జనాలు. దీనికింద పాడిపంటలు , దేవత , వంశవృక్షం, బొబ్బిలిరాజా, హిమ్మత్ వాలా, సీతారామయ్యగారి మనవరాలు ఇలా లెక్కెట్టు కుంటా పొతే మొత్తం నూటెనిమిదికి పైగా సినిమాల షూటింగ్ జరిగింది. కెమేరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది. అంత మహత్యం ఉన్న చెట్టు ఇది అని అక్కడ షూటింగ్స్ చేసిన మేకర్స్ అంతా చెబుతారు. అంతేనా.. ఈ చెట్టుకింద షూటింగ్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇక గోదావరి లవర్.. దర్శకుడు వంశీ రూపొందించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఈ చెట్టు ఉంటుంది. ఇక్కడ ఒక్క షాట్ అయినా తీయడం వంశీకి ఇష్టం. ఇక్కడ ఏకంగా 18 సినిమాల షూటింగ్స్ చేశాడట వంశీ.
1974 లో వచ్చిన పాడిపంటలు చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాటనుండి మొదలైన ఈ చెట్టు సినిమా ప్రస్థానం.. సీతా రామయ్య గారి మనవరాలు లో సమయానికి అనే పాట, గోదావరి లో ఉప్పొంగేలే గోదావరి.. లాంటి పాటలు... ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూపోతే వందలాది పాటలు...
జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి.
ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా.. అన్నేళ్ల చరిత్ర.. అంత గొప్ప సినిమాలకు సెంటిమెంటూ అయిన ఆ నిద్రగన్నేరు చెట్టు.. తాజాగా గోదావరి వరద ప్రవాహానికి తల ఒంచింది. ఈరోజు( సోమవారం) తెల్లవారుజామున ఒక్కసారిగా కూలిన ఈ మహావృక్షం ఆ గోదారి తల్లి ఒడిలోకే చేరిపోయింది.