లెజెండరీ యాక్టర్.. తెలుగు సినిమా కలికితురాయి అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే తెలుగు కళామతల్లికి రెండు కళ్ల లాంటి వాళ్లు అని చెప్పుకున్న చారిత్రక నటుడు. అలాంటి నటుడి శతజయంతిని తెలుగు సినిమా పరిశ్రమ పట్టించుకోలేదు. బాలకృష్ణ, చిరంజీవి లాంటి వాళ్లు తప్ప కనీసం స్మరించుకున్నవాళ్లు కూడా లేకపోవడం విషాదం. పోనీ కాంతారావులాగా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు ఇండడస్ట్రీలో లేరా అంటే నాగార్జున తర్వాత తరం కూడా సిద్ధంగా ఉంది. అయినా టాలీవుడ్ నుంచి కనీసం ఓ చిన్న సభ నిర్వహించలేదు. ఇది ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటుడిని మళ్లీ చూడలేం. నిత్య విద్యార్దిగా నిరంతరం తనను తాను అప్డేట్ చేసుకున్న అరుదైన నటుడు ఆయన. పర్సనాలిటీకి కథలతో అద్భుతమైన చిత్రాలను అందించారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఇండస్ట్రీకి సేవలు అందించారు. అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటుడిని స్మించుకోవడం అంటే సినిమాను గౌరవించడమే అవుతుంది. ఈ విషయంలో సినిమా పరిశ్రమ ఆయన విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించింది అనే చెప్పాలి. ఈ విషయంలో జాతీయ స్థాయిలో ఉన్న ఫిల్మ్ హెరిటేజ్ వాళ్లు వంద రెట్లు నయం. ఆయన జ్నాపకంగా ఏఎన్నార్ నటించిన బెస్ట్ మూవీస్ ను సెలెక్ట్ చేసి దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో ప్రదర్శించబోతున్నారు.
టాలీవుడ్ వాళ్లు ఇలాంటి ప్రదర్శనలేం చేయక్కర్లేదు. కనీసం ఆయన శత జయంతి సందర్భంగా ఓ చిన్న సమావేశం ఏర్పాటు చేసి స్మరించుకున్నా సరిపోయేది. గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించింది తెలుగు సినిమా. తమిళ్, కన్నడ వాళ్లు ఆయనకు నివాళిగా అనేక సభలు నిర్వహించిన చాలాకాలానికి వీళ్లు ఏదో తూతూ మంత్రంగా ఓ సభ ఏర్పాటు చేశారు. దానికీ ఇండస్ట్రీ బిగ్ విగ్స్ అటెండ్ కాలేదు. ఇప్పుడు అక్కినేని విషయంలోనూ అదే రిపీట్ అవుతోంది.