tollywood: అభిమానుల ముసుగులో అకృత్యాలు

ఫ్యాన్స్ ముసుగులో మృగాలు... సెలబ్రెటీలకు అభిమానులతో చేదు అనుభవం... అత్యుత్సాహంతో సమస్యలు కొనితెచ్చుకుంటున్న వైనం...

Update: 2025-12-22 10:30 GMT

అభిమానం హద్దు మీరకూడదు. ఒకవేళ గీత దాటితే ఆ పరిణామం తీవ్రత ఊహించలేం. అది అభిమానులకా లేక సెలబ్రెటీలకా ఎవరికనీ చెప్పలేం. తెరపై ఆరాధించే వ్యక్తులు భౌతికంగా కనిపించకపోవటంతో వాళ్లు జనాల మధ్యకు వచ్చినప్పుడు చూడాలనుకోవటం తప్పులేదు. దీనివల్ల ఒరిగేది ఏమి లేదు. కానీ అదొక మెమరబుల్ మూమెంట్. సరే వెళ్లిన చోట హుందాగా ఉండకుండా హద్దు దాటి ప్రవర్తించకూడదు. అభిమాన తారతో ఫొటో, షేక్‌హ్యాండ్ ఆసించటం తప్పులేదు. కానీ మృగాళ్లాగ మీద పడటం క్షమించరాని తప్పు. ఇలా చేసే ముందు ఒకసారి వారు వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలి. వారి తల్లి, చెల్లితో అయితే ఇలాగే ప్రవర్తిస్తారా లేదా అభిమాని కనిపించేసరికి ఆలోచన కోల్పోతున్నారా. సెలబ్రెటీలపై అభిమానుల తీరు చర్చానీయాంశంగా మారింది.

బాలయ్య తీరే సరైనదా

మెున్న హీరోయిన్ నిధి అగర్వాల్, నేడు సమంత. సెలబ్రెటీలు, పొలిటీషియన్లు, క్రికెటర్లు ఇలా ఎవరు వచ్చినా వారిని చూసేందుకు భారీగా జనం తరలివస్తారు. అయితే చూడలనుకోవటం కంటే అసభ్యకరంగా ప్రవర్తించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజా ఘటనలు ఇందుకు నిలువుటద్దంలా కనిపిస్తున్నాయి. ఈ తరహా ఆలోచన ఉన్నవారు కొద్ది మందే అయినప్పటికీ మిగిలిన వారు ఫొటో, సెల్పీలకోసం ఎగబడిన వారు మరికొందరు. ఈ క్రమంలో తోపులాట జరుగుతుంది. ముందు జరిగే పరిణామాల గురించి ఆలోచించకుండా అనాలోచనగా ఉంటున్నారు. దీంతో అభిమానుల మధ్యకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు నందమూరి బాలయ్య ప్రవర్తించే తీరే కరెక్ట్ అనిపిస్తుంది. ఇలా చేస్తే అభిమానులపై చేయి చేసుకున్నాడు అంటారు. లేకపోతే వాళ్లు చేతులు వేసేందుకు ప్రయత్నిస్తూ మృగాళ్లా ప్రవర్తిస్తున్నారు.

 అభిమానం పేరుతో అరాచకం

'ది రాజాసాబ్' సాంగ్ రిలీజ్ ఈవెంట్‌‌కు వెళ్లిన హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్ నిర్వహణకు పర్మిషన్ తీసుకోలేదు. లూలు మాల్ యాజమాన్యం అందరినీ అనుమతి ఇచ్చింది అని మాల్ యాజమాన్యం, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. పర్మిషన్ తీసుకోకపోవటం తప్పే అయినప్పటికీ ఈ విధంగా ప్రవర్తించిన వారికి ఎలాంటి శిక్ష లేదు. బాధ్యులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా మిగిలిన వారిపై కేసు నమోదు చేస్తే మార్పు శూన్యం. భద్రతా ఏర్పాట్లు సరిగ్గా లేవని అనుమతి తీసుకుంటే కట్టుదిట్టంగా ఏర్పాటు చేసేవారిమని పోలీసులు చెప్పారు. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాట జరిగింది పోలీసు బందోబస్తు ఉన్నప్పుడే కదా. ఇక్కడ ఎవరినీ తప్పుబట్టటానికి లేదు. మనలో నైతిక విలువలు, ఆలోచన సరళి మంచిగా లేనప్పుడు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఉపయోగం ఉండదు. లాఠీ చార్జ్, బందోబస్తు ఉంటేనే మాట వింటారంటే మార్పు ఎప్పుడు వస్తుంది. ఎంతమందిలో వస్తుంది. ఒకసారి క్రౌడ్ నుంచి కారులోకి వెళ్లిన తర్వాత నిధి ఎక్స్‌ప్రేషన్ చూస్తే ఆమె ఎంత టెన్షన్ ఫీల్ అయ్యిందో తెలుస్తోంది. మరి అభిమానం పేరుతో అయోమయం, భయానికి గురి చేయటమే ఫ్యాన్స్ ఉద్దేశమా. నటి సమంత జూబ్లీహిల్స్‌లో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు ఇదే పద్దతి రిపీట్ అయ్యింది. కార్యక్రమం అనంతరం కార్ వైపు వెళ్తున్న ఆమెను ఒక్కసారిగా చుట్టుముట్టి తాకేందుకు ప్రయత్నించారు. అత్యంత కష్టంగా ఆమె బాడీగార్డ్‌లు సమంతను సేఫ్‌గా తరలించారు. ఇది ఎప్పుడో ఎవరో ఒకరి విషయంలో కాదు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో పబ్లిక్‌లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు.

 కష్టాలు కొనితెచ్చుకుంటున్న సామాన్యులు

అయితే ఇలాంటి అభిమానం కట్టలు తెంచినప్పుడు బలి అయ్యేది సాధారణంగా సామాన్యులే. తరువాత ఎవరినీ అని ప్రయోజనం ఉండదు. పుష్ప 2 సినిమా తొక్కిసలాట ఘటనలో పలువురిపై లాఠీ ఛార్జ్ చేశారు. అంతేకాకుండా ఓ మహిళ మృతి చెందగా.. చిన్న వయసులో ఈమె కుమారుడు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి కొంత మంది అన్యాయంగా చనిపోయారు. ఇలా మన చావును మనమే కోరితెచ్చుకుంటున్నాం. అభిమానిని చూద్దామని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తూ భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది మనమే. ఎంతో కష్టపడి వెళ్లి సంయమనం పాటించి జాగ్రత్తగా వ్యవహరించుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు కదా. ఒక వ్యక్తిని ఆరాధించడం అంటే వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే కానీ, వారి స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదు. కేవలం ఒక సెల్ఫీ కోసమో లేదా ఒక్క క్షణం తాకడం కోసమో చేసే ప్రయత్నం.. అవతలి వ్యక్తికి ప్రాణసంకటంగా మారుతుందన్న స్పృహ ప్రతి అభిమానిలో కలగాలి. ఇక్కడ కేవలం పోలీసుల బందోబస్తునో, నిర్వాహకుల వైఫల్యాన్నో తప్పుబట్టి ప్రయోజనం లేదు. మార్పు అనేది వ్యక్తిగత విచక్షణ నుంచి రావాలి. సెలబ్రెటీలు కూడా మనలాంటి మనుషులేనని, వారికి కూడా వ్యక్తిగత ప్రైవసీ మరియు గౌరవం అవసరమని గుర్తించినప్పుడే ఇలాంటి అమానవీయ ఘటనలకు అడ్డుకట్ట పడుతుంది. వెర్రి అభిమానం విచక్షణ కోల్పోతే అది అరాచకానికి దారితీస్తుంది. కాబట్టి, అభిమానం హద్దుల్లో ఉన్నప్పుడే దానికి అందం, ఆచరించేవారికి గౌరవం.

Tags:    

Similar News